Wednesday, January 22, 2025

అవిశ్వాసాలు.. అసంతృప్తులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో అసంతృప్తుల అవిశ్వాస తీర్మానాలు అధికమవుతున్నాయి. పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తికావడంతో అసంతృప్తులు అవిశ్వాసాలకు పదునుపెడుతున్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తి కావడంతో కౌన్సిలర్లు తమ డిమాండ్లు సాధించు కోవడంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానా లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండడం, 2020 జనవరి 27వ తేదీన కొలువుదీరిన పాలక వర్గాల -మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో చాలాచోట్ల అసంతృప్తులు అధికమయ్యాయి.

అయితే అవిశ్వాసాల గొడవలు లేకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల్లో (సెప్టెంబర్)లో పురపాలక చట్ట సవరణ బిల్లునుఆమోదించింది. నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాసం పెట్టేలా చట్ట సవరణ చేస్తూ ఉభయ సభలు బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపాయి. పురపాలక బిల్లు సహా 7 బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర పడకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. అప్పటి నుంచి ఈ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాలు అధికమయ్యాయని పలు పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త చట్ట సవరణ ఇలా….
జీహెచ్‌ఎంసీ, పురపాలకసంఘాల చట్ట సవరణ బిల్లుకు గత శాసనసభ సమావేశాల్లో సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సభలో ప్రవేశపెట్టగా మెజార్టీ సభ్యులు సవరణలకు ఆమోదం తెలపడంతో ఈ బిల్లు పాస్ అయ్యింది. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్‌గా ఉన్నప్పుడు మహాన గరానికి 100 వార్డులు ఉండేవి. ఆనాటి జనాభా ప్రకారం కో ఆప్షన్ సభ్యుల సంఖ్య ఐదుగా ఉండేది. ప్రస్తుతం ఈ సంఖ్యను ఐదు నుంచి 15కు పెంచుకోవడంతో పాటు పెరుగుతున్న జనాభా దృష్ట్యా కార్పొరేషన్‌లో కో ఆప్షన్ సభ్యులను అదనంగా పెంచాలని ఈ చట్ట సవరణలో ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతోపాటు రాజ్యసభ సభ్యులు, శాసనసభ సభ్యులకు ఎక్స్ అఫిషియో మెంబర్‌షిప్ విషయంలో ఉన్న టైపో ఎర్రర్‌ను సైతం దీనిలో సవరించుకున్నారు. వీటితో పాటు మున్సిపల్ చట్టం ప్రకారం మూడేళ్లు ఉన్న అవిశ్వాస తీర్మానాన్ని నాలుగేళ్లకు మారుస్తూ ఇరు సభలు చట్ట సవరణ చేశాయి.

పలుచోట్ల కౌన్సిలర్ల వేరుకుంపట్లు
ప్రస్తుతం ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో మూడేళ్లుగా గుట్టుగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఓ వైపు ఆమోదం పొందని మున్సిపల్ సవరణ చట్టం, మరో వైపు రగిలిపోతున్న అసంతృప్తులతో రాష్ట్రంలోని పురపాలికల్లో రాజకీయ వేడి రాజుకుంటుంది. పలుచోట్ల కౌన్సిలర్ల వేరుకుంపట్లు పెట్టడం వారిని ఎమ్మెల్యేలు, మంత్రులు బుజ్జగించడానికి నానాతంటాలు పడుతున్నారు. ఇదే అదునుగా మరికొందరు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ కావాలనుకునే ఆశావహులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం కావడంతో పాటు మిగిలిన రెండేళ్ల కాలానికైనా తమకు అవకాశం ఇవ్వాలని వారు అభ్యర్థిస్తున్నారు.

జవహర్‌నగర్ మేయర్, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌లపై అవిశ్వాస తీర్మానం
ఇప్పటికే జగిత్యాలలో విభేదాల కారణంగా చైర్ పర్సన్ రాజీనామా చేయడంతో స్థానికంగా రాజకీయ వేడిని రాజేసింది. ఇదే తరహాలో జనగామలో ఓ పార్టీకి చెందిన కౌన్సిలర్లు 11 మందితో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఆర్మూర్‌లో కౌన్సిలర్లలో అసంతృప్తి చెలరేగడంతో అక్కడ పలు పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. హుజూరాబాద్ సహా పలుచోట్ల నాయకుల మధ్య అంతరం కొనసాగుతోంది. ఇక మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోని జవహర్‌నగర్ మేయర్ కావ్యపై 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. తాండూరు బిఆర్‌ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమళపై కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం, టిజేఎస్‌కు చెందిన దాదాపు 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీ, యాదగిరిగుట్టలో సైతం ఈ పంచాయతీ ప్రారంభం అయినట్టుగా తెలిసింది.

అన్ని పార్టీలు అప్రమత్తం
ఈ నేపథ్యంలోనే పలు పార్టీలు నాయకులు అప్రమత్తమయ్యారు. ఒకపక్క అవిశ్వాసంపై చర్చలు జరుపుతూనే మరో వైపు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, ఇతర పార్టీల కౌన్సిలర్లపై దృష్టి సారించడంతో ఆయా పార్టీల నాయకులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే క్యాంపుల నిర్వహించి తమ పట్టును నిలుపుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
నోటీసు ప్రకారం అధికారులు నడుచుకోవాల్సిందే..
అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రజా ప్రతినిధులు నోటీసు ఇస్తే చట్ట ప్రకారం అధికారులు సైతం నడచుకోవాల్సిందే. తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించే చర్యలకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. పురపాలికల్లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించి తమకు తెలియకుండా కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించకుండా ముందస్తు చర్యలు చేపట్టడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News