కోదాడ : సూర్యాపేట జిల్లా, కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ వనపర్తి శిరీషపై అవిశ్వాస పెట్టాలని కోరుతూ మెజారిటీ కౌన్సిలర్లు తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు గురువారం అందజేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. మళ్లీ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే తమ పీఠాలు పదిలంగా ఉంటాయని ఆ వర్గాల నేతలు భావించారు. కానీ సీను రివర్స్ అయింది. గతంలో సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చైర్‌పర్సన్‌ను నానా ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే.
ఈ అవకాశాన్ని కాంగ్రెస్ నాయకులు ఆయుధంగా మలుచుకొని అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాలని కోరుతూ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ప్రస్తుతం చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా 27 మంది కౌన్సిలర్లు సంతకాలు పెట్టినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు చనిపోవడంతో ఇంకా 34 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 27 మంది కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోరుతున్నారు.