ఏడురోజుల వ్యవధిలో ఓటింగ్ ప్రక్రియ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి అత్యంత కీలక సవాలు ఆరంభం అయింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) లో సోమవారం ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై ఈ నెల 31వ తేదీన సభలో చర్చ జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై సభలో ముందుగా ఓటింగ్ జరిగింది. ఇందులో అనుకూలంగా 161 ఓట్లు వచ్చాయి. దీనితో సభలో అవిశ్వాస తీర్మానం రాజుకుంది. తరువాతి దశలో సభను 31వ తేదీకి వాయిదా వేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకులు పిఎఎల్ ఎన్ నేత షాబాజ్ షరీఫ్ . దిగువ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చను 31వ తేదీన ఖరారు చేసినట్లు ఉపసభాపతి ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల వరకూ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. చర్చ తరువాత ఏడు రోజులకు బలపరీక్ష చేపడుతారు. అంతకు ముందు పార్లమెంట్ స్పీకర్ అసద్ ఖైసర్ ప్రతిపక్ష నేతలతో సమావేశం అయ్యారు. అంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది.
సభలో బలపరీక్షకు తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత రెండు మూడు రోజుల విరామం ఇచ్చి చర్చ జరుగుతుందని వారికి నచ్చచెప్పారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం కోసం సభ ఏర్పాటు అయింది. అయితే ఇటీవలే మృతి చెందిన అధికార పిటిఐ పార్టీ ఎంపి ఖయాల్ జమాన్‌కు నివాళి ప్రకటన తరువాత సభను వాయిదా వేశారు. ఇప్పుడు సోమవారం తిరిగి సభ ఆరంభం అయింది. ఓ వైపు అవిశ్వాస తీర్మానం దశలోనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి విదేశీ నిధుల వ్యాజ్యం చిక్కుల్లోకి నెట్టింది. ఆయన పార్టీ పిటిఐకి చెందిన ఖాతాల ఆర్థిక తనిఖీలు కీలకంగా మారాయి.
వివరణలేని లావాదేవీలు అనేకం జరిగాయి. అక్రమ ఆర్థిక వ్యవహారాలను నడిపించారని కనుగొన్నారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సొంత పార్టీ నిధుల యాజమాన్యం లేదా నిర్వహణలతో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సొంత పార్టీకి నిధులు ఖర్చుల పద్దుల సంగతి ఆయనకు తెలియకుండా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నిధుల అక్రమ వ్యవహారాలలో ఆయన జవాబుదారి బాధ్యతల్లో అధికారంగా ఉంటారు. ఈ కోణంలో ఇమ్రాన్ అరెస్టు జరగవచ్చునని వార్తలు వెలువడ్డాయి. అవిశ్వాసం అరెస్టులతో ఇకపై ఇమ్రాన్ రాజకీయ భవిత ఏమిటనేది ప్రశ్నార్థకం అయింది.