Saturday, December 21, 2024

కష్టాల్లో ఇమ్రాన్!

- Advertisement -
- Advertisement -

Russia Ukraine War live updates

సంపాదకీయం:  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వెనుక గల శక్తులు ఎటువంటివి, ఎవరు అనేది కీలకమైన ప్రశ్న. కేవలం సైన్యం మద్దతు కోల్పోయినందు వల్లనే ఇమ్రాన్ ఖాన్‌కు ఈ గడ్డు పరిస్థితి ఎదురైందా లేక ఆయన చెబుతున్నట్టు అంతర్జాతీయ శక్తుల కుట్ర వల్లనా అనేది వివరంగా తెలియవలసి వుంది. అఫ్ఘానిస్తాన్‌లో తిరిగి తాలిబాన్లు అధికారం చేపట్టడం వెనుక పాకిస్తాన్ హస్తం వున్నదనేది సుస్పష్టం. ఇందువల్ల అమెరికా ఇమ్రాన్ ఖాన్‌పై వ్యతిరేకతను పెంచుకున్నదని భావిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాకిస్తాన్ అమెరికాకు దూరమై చైనా, రష్యాలకు చేరువైంది. ఇది పాక్ సైన్యానికి కూడా అంగీకారం కాదని, అందుచేత సైన్యం ప్రోత్సాహంతోనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు బలం చేకూరిందని, ప్రతిపక్షాలు తీసుకు వచ్చిన ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రేక్ ఎ ఇన్సాప్ (పిటిఐ) కు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా నిర్ణయించుకున్నారని బోధపడుతున్నది.

సైన్యం కోరుతున్నట్టు అమెరికాతో మైత్రికి విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్ స్వతంత్ర విదేశాంగ విధానం వైపు వుండడమే సైన్యానికి, ఆయనికి మధ్య దూరాన్ని కలిగించిందని తెలుస్తున్నది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం విషయంలో తనది తటస్థ పాత్రేనని పాక్ సైన్యం చెబుతున్నది. ఖాన్ వైపు గాని, ప్రతిపక్షం వైపు గాని తాము వుండబోమని అది వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ ఆ మధ్య ఒక సభలో మాట్లాడుతూ మనుషులెవరూ తటస్థంగా వుండజాలరని, వుంటే మంచి వైపో లేకపోతే చెడువైపో వుండి తీరుతారని అన్నారు. ఇది తనను ఉద్దేశించినదేనని సైన్యం భావిస్తున్నది. పాకిస్తాన్‌కు 22వ ప్రధానిగా క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టులో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అప్పటి నుంచి ఆయనకు సైన్యం మద్దతు ఇస్తూ వచ్చింది. పాకిస్తాన్ సైనిక గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నూతన అధినేత విషయంలో కూడా ఇమ్రాన్‌కు సైన్యానికి విభేదాలు తలెత్తాయని చెబుతున్నారు. ఈ విషయంలో సైన్యం ప్రతిపాదనను ఆమోదించకుండా చాలా కాలంగా సంబంధిత ఫైలును ఇమ్రాన్ పెండింగ్‌లో వుంచడం సైన్యానికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ద్రవ్యోల్బణం, ధరలు మిన్నంటడంతో ఇమ్రాన్ ఖాన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని దీనిని ఎదుర్కోడంలో ఆయన విఫలమయ్యాడని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కొనసాగాలంటే 342 మంది సభ్యులు గల పాక్ పార్లమెంటులో 172 మంది మద్దతు అవసరం. ఖాన్ ప్రభుత్వం 179 మంది సభ్యుల బలంతో అధికారంలోకి వచ్చింది. అందులో పాలక పిటిఐ బలం 155 కాగా, ఎంక్యూఎం పి, పిఎంఎల్ క్యూ, బిఎపి, జిడిఎ అనే నాలుగు పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నాలుగు పార్టీలు వరుసగా ఏడు, ఐదు, ఐదు, ముగ్గురు సభ్యుల బలాన్ని కలిగి వున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ సొంత పార్టీ నుంచే పలువురు సభ్యులు ఆయనకు వ్యతిరేకం కావడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం ఖరారైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లో ఏర్పాటైన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. సభకు జనం విశేషంగా హాజరు కావడం గమనించవలసిన అంశం. ఈ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ తెల్ల చొక్కా నేరగాళ్లు దేశాన్ని లూటీ చేశారని అన్నారు. పేద దేశాల్లో చట్టం తెల్లచొక్కా నేరస్థుల జోలికి పోదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పందికొక్కులు 30 ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను నంజుకు తింటున్నాయని వ్యాఖ్యానించారు. వీరు దేశంలోని ధనరాసులను దోచుకొని విదేశీ ఖాతాల్లో దాచుకుంటున్నారని కూడా అన్నారు. తన ప్రభుత్వం పడిపోయినా, తన ప్రాణం మీదికే వచ్చినా ఈ శక్తులను అంతమొందించడానికి తాను తుదికంటా పోరాటం చేస్తానని కూడా హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు తనపై అవిశ్వాస తీర్మానం తెచ్చిన ప్రతిపక్ష నేతలను ఉద్దేశించినవేనన్నది సుస్పష్టం. తాను మహిళలకు ఆస్తిలో వారసత్వ హక్కు కల్పించే బిల్లు తెచ్చానని, కొవిడ్‌లో కూడా ఆర్థిక స్వస్థతను కాపాడానని చెప్పుకున్నారు. అవిశ్వాసం నెగ్గడం తన ప్రభుత్వం కూలడం ఖాయమని స్పష్టపడిపోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఇండియాను మెచ్చుకుంటూ మాట్లాడడం మొదలు పెట్టారు.

మన విదేశాంగ విధానాన్ని కొనియాడారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలతో మొదలై సైన్యంతో సంబంధాలు చెడిపోడం, అమెరికాకు దూరం కావడం వంటి అంశాలు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేక వాతావరణాన్ని గట్టి పరిచాయి. ప్రజల్లో ఆయన పట్ల ఇంకా అనుకూలత వుండి వున్నప్పటికీ పార్లమెంటులో ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయారని బోధపడుతున్నది. పదవీ కాలం పూర్తి కాక ముందే పాక్ ప్రధానులు పదవీచ్యుతులు కావడం కొత్త విషయం కాదు. ఇమ్రాన్ ఖాన్ విషయంలోనూ అదే జరుగుతున్నది. పాక్‌లో ఈ అస్థిర రాజకీయాలు తొలగాలంటే అది సైన్యం పడగ నీడ నుంచి బయటపడాలి. అటువంటి మంచి పరిణామాన్ని సాధించగల దృఢమైన నాయకత్వం రావాలి. దానిని ప్రజలే స్వయంగా తీసుకు రాగలగాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News