Thursday, December 12, 2024

ఉప రాష్ట్రపతిపై అవిశ్వాసం.. రాజ్యసభలో రభస

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌ను తూర్పారబట్టిన సభా నాయకుడు నడ్డా
లోక్‌సభలోనూ అదే పరిస్థితి
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు గందరగోళ దృశ్యాల నడుమ బుధవారం వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై టిఎంసి సభ్యుడు కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అలజడి సృష్టించగా పదే పదే వాయిదాల అనంతరం లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభ ఎటువంటి కార్యకలాపాలూ నిర్వహించకుండానే బుధవారం మధ్యాహ్నం గురువారానికి వాయిదా పడింది. సభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్‌పైన, జార్జి సోరోస్ వివాదంపైన అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో గందరగోళ పరిస్థితులు నెలకొనగా సభను వాయిదా వేయవలసి వచ్చింది. బుధవారం మొదటిసారి వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ తిరిగి సమావేశమైన వెంటనే సభా నాయకుడు జెపి నడ్డా మాట్లాడుతూ, దేశాన్ని అస్థిరపరిచేందుకు బిలియనీర్ మదుపరి జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఆరోపించారు.

ఉన రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిందుకు కూడా కాంగ్రెస్‌ను ఆయన ఆక్షేపించారు. ‘కాంగ్రెస్ అధిష్ఠానం, సోరోస్ మధ్య సంబంధాల’ అంశంపై నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షం చేసిన ప్రయత్నం అది అని ఆయన అన్నారు. సభ సమావేశమైన తరువాత, సభా నాయకుడు మాట్లాడేందుకు డిప్యూటీ చైర్మన్ అనుమతించిన వెంటనే అధికార పక్ష సభ్యులు లేచి ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ‘జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి గల సంబంధాల అంశాన్ని మా సభ్యులు గత రెండు రోజులుగా లేవదీస్తున్న విషయం మీ దృష్టికి తీసుకువస్తున్నా. సోరోస్‌కు, సోనియా గాంధీకి మధ్య ఎటువంటి సంబంధం ఉంది?’ అని నడ్డా అన్నారు. ఇది దేశ సార్వభౌమత్వానికి, అంతర్గత, బాహ్య భద్రతకు సంబంధించిన అంశం అని ఆయన చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం, జార్జి సోరోస్ మధ్య సంబంధంపై చర్చ జరగాలని నడ్డా కోరారు.

‘మావాళ్లు కోపంగా ఉన్నారు, దీనిపై చర్చ కోరుతున్నారు’ అని ఆయన చెప్పారు. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ అంశాన్ని నడ్డా ప్రస్తావిస్తూ, సభాధ్యక్షునిపై ఆరోపణలు చేయడం ద్వారా అసలు సమస్య నుంచి వారు దృష్టి మళ్లించజూస్తున్నారని విమర్శించారు. ‘దేశ సార్వభౌమత్వం, అంతర్గత, బాహ్య భద్రతకు ముప్పు నుంచి దేశం దృష్టి మళ్లించేందుకు ఇది ఒక వ్యూహం, కాంగ్రెస్ దీనికి దోహదం చేసింది. (విదేశీ శక్తులకు)మద్దతు ఇవ్వడంలో వారికి ఒక సాధనంగా ఆ పార్టీవారు మారుతున్నారు, దీనిపై చర్చ జరగాలి’ అని నడ్డా అన్నారు. ‘చైర్మన్‌పై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న తీరు గర్హనీయమని కూడా స్పష్టం చేయదలిచాను. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని సభా నాయకుడు అన్నారు. ‘వారు సభలో గాని, వెలుపల గాని చైర్మన్‌ను ఎన్నడూ గౌరవించలేదు & చైర్మన్ నిర్ణయంపైన, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపైన వారు వ్యాఖ్యలు చేసిన తీరు గర్హనీయం’ అని నడ్డా అన్నారు. ప్రతిపక్ష సభ్యులు పదే పదే అలజడి సృష్టిస్తుండడంతో సమస్త దేశం ఆగ్రహంతో ఉన్నదని, వారిని ఎన్నటికీ క్షమించబోదని నడ్డా చెప్పారు.

లోక్‌సభలో అలజడి, వాయిదా
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సభ్యుడు కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో అలజడి రేపాయి. కల్యాణ్ బెనర్జీ క్షమాపణ చెప్పినప్పటికీ రభస సద్దుమణగకపోవడంతో సభను పదే పదే వాయిదాల అనంతరం తుదకు సభాధ్యక్షుడు గురువారానికి వాయిదా వేశారు. విపత్తు నిర్వహణ చట్టానికి సవరణలపై చర్చ సమయంలో బెనర్జీ మాట్లాడుతున్నప్పుడు గందరగోళం నెలకొన్నది. కొవిడ్ 19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని టిఎంసి సభ్యుడు ఆరోపించారు. కానీ హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆయన ఆరోపణను తోసిపుచ్చారు. అన్ని రాష్ట్రాలకు సాయం చేసింది, ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది ప్రధాని నరేంద్ర మోడీయేనని రాయ్ చెప్పారు.

తమ భూభాగం ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ల రవాణాలో అంతరాయం కలిగించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నించిందని కూడా రాయ్ ఆరోపించారు. సింధియా లేచి, రాయ్‌ను సమర్థించారు. మహమ్మారి సమయంలో భారత్ ‘విశ్వ బంధు’గా ఆవిర్భవించిందని, ప్రపంచవ్యాప్తంగా ఆపన్న దేశాలు అన్నిటికీ సాయం చేసిందని సింధియా తెలియజేశారు. దీనితో సింధియాని బెనర్జీ తప్పు పట్టుతూ, ఆయనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని స్పీకర్ ఓమ్ బిర్లా తొలగించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు సాగడం సభ వాయిదాకు దారి తీసింది. సభ తిరిగి సమావేశమైనప్పుడు బెనర్జీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. కానీ వాటిని అంగీకరించేందుకు సింధియా నిరాకరించారు. ‘కల్యాణ్ బెనర్జీ ఈ సభలో లేచి విచారం వెలిబుచ్చారు.

అయితే, దేశం అభివృద్ధి కోసం సేవ స్ఫూర్తితో మనం అంతా ఈ సభకు వస్తుంటాం& మనం ఆత్మ గౌరవ భావంతో కూడా వస్తుంటాం. తమ జీవితాల్లో ఏ వ్యక్తి అయినా తమ ఆత్మ గౌరవంతా రాజీ పడరు. మా విధానాలపై, మా అభిప్రాయాలపై విమర్శలు చేయండి, కానీ మీరు వ్యక్తిగత స్థాయికి వెళితే, తత్ స్పందకు కచ్చితంగా సిద్ధపడాలి’ అని కేంద్ర మంత్రి అన్నారు. ‘ఆయన క్షమాపణ చెప్పారు& కానీ, నాపైన, భారత మహిళలపైన ఆయన చేసిన వ్యక్తిగత దాడికి ఆయన క్షమాపణను నేను అంగీకరించడం లేదు’ అని సింధియా స్పష్టం చేశారు. బెనర్జీ మళ్లీ క్షమాపణ చెప్పారు కానీ అధికార పక్ష సభ్యుల నుంచి నిరసనలు కొనసాగాయి. సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఎ రాజా ముందు సాయంత్రం 5 గంటల వరకు, ఆ తరువాత గురువారానికి సభను వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News