Thursday, December 12, 2024

ధన్‌ఖడ్‌పై అభిశంసన తీర్మానం

- Advertisement -
- Advertisement -

రాజ్యసభ కార్యదర్శికి
నోటీసులు అందజేసిన
ఇండియా కూటమి నేతలు
నోటీస్‌పై 60మంది ప్రతిపక్ష
ఎంపీల సంతకాలు
రాజ్యాంగ పదవుల్లో ఉన్న
కాంగ్రెస్ అగ్రనేతల
సంతకాలు లేవు
అవిశ్వాస తీర్మానం
విచారకరం : రిజిజు

ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ రాజ్యసభను పక్షపాత ధోరణితో నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆయన తొలగింపు కోసం మంగళవారం ఒక తీర్మానం ప్రతిపాదనకు నోటీస్ అందజేశారు. కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేష్, నసీర్ హుస్సేన్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీకి నోటీసు అందజేశారు. ఉప రాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్. కాంగ్రెస్, ఆర్‌జెడి, టిఎంసి, సిపిఐ, సిపిఐ (ఎం), జెఎంఎం, ఆప్, డిఎంకె సహా ప్రతిపక్షాల ఎంపిలు దాదాపు 60 మంది నోటీసుపై సంతకం చేశారని అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. అయితే, రాజ్యాంగ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ అగ్ర నేతలు నోటీసుపై సంతకం చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి. సంతకం చేయని ప్రముఖుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, వివిధ పక్షాల సభా నాయకులు కూడా ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి.

ప్రతిపక్షాలు, రాజ్యసభ చైర్మన్ మధ్య సంక్షుభిత సంబంధాల నేపథ్యంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసుకు కాంగ్రెస్ సారథ్యం వహిస్తోంది. ‘రాష్ట్రాల మండలి కార్యకలాపాలను అత్యంత పక్షపాత ధోరణితో నిర్వహిస్తున్నందుకు రాజ్యసభ గౌరవనీయ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని లాంఛనంగా సమర్పించడం మినహా ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీలకు వేరు మార్గం లేదు. ఇండియా కూటమి పార్టీలకు ఇది ఎంతో బాధాకర నిర్ణయమే, కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రయోజనాల రీత్యా అవి ఈ పని చేయవలసి వస్తోంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి) జైరామ్ రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘అందరూ సంతకం చేయగా, ఉప రాష్ట్రపతికి వ్యతిరేకంగా ప్రతిపాదించడమైంది. గెలిచేందుకు మా వద్ద సంఖ్యా బలం లేదు, కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం పోరుకు ఇది గట్టి సందేశం. వ్యక్తులకు వ్యతిరేకంగా ఏదీ లేదు, ఇది వ్యవస్థల కోసం పోరాటం’ అని టిఎంసి ఎంపి, రాజ్యసభలో ఉప నేత సాగరికా ఘోష్ తెలిపారు. అనేక అంశాలపై ధన్‌ఖడ్ తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం చెందాయి.

తాజాగా, ఎగువ సభలో కాంగ్రెస్ సోరోస్ ‘లింక్’ అంశం ప్రస్తావనకు అధికార పక్ష సభ్యులను ఆయన అనుమతించడం ప్రతిపక్షాల కు మరింత కోపం తెప్పించింది. ఉప రాష్ట్రపతి తొలగింపునకు తీర్మానం ప్రతిపాదన కోసం కావలసిన కనీస సంఖ్యా బలం 50. రాజ్యసభ చైర్మన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఉప రాష్ట్రపతిని పదవిలో నుంచి తొలగించేందుకు ఒక తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీస్ ఇవ్వాలని ఇండియా కూటమి పార్టీలు గత ఆగస్టులో కూడా యోచించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News