Sunday, January 12, 2025

ప్రధాని ప్రసంగం కోసమే అవిశ్వాసం

- Advertisement -
- Advertisement -

భారత దేశం ప్రజాస్వామ్యానికే మాతృక అని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని అంతర్జాతీయంగా మనం ఘనంగా చెప్పుకొంటున్నాము. ప్రజాస్వామ్యం అంటే కేవలం క్రమంగా ఎన్నికలు జరగడం, ప్రజలు ఓట్లు వేయడమే కాదు, చట్టసభలు సక్రమంగా జరగడం కూడా అత్యంత కీలకం. చట్ట సభలలో ఎన్నికైన ప్రతినిధులు చట్టాలపై, ప్రభుత్వ విధానాలపై లోతయిన చర్చలు జరపాలి. కానీ కొంత కాలంగా మన పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు మొక్కుబడిగా మాత్రమే సమావేశమవుతూ మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. కీలకమైన చట్టాలను సహితం సవివరంగా చర్చలులేకుండానే హడావుడిగా, గందరగోళం మధ్య ఆమోదిస్తున్నారు. చట్టాలను ఆమోదింప చేయడంలో అధికార, ప్రతిపక్షాలు ఒక విధంగా రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రు పక్షాలుగా వ్యవహరిస్తున్నాయి.
తప్పనిసరైతే గాని ప్రధాన మంత్రి గాని, ముఖ్యమంత్రులు గాని చట్టసభలకు హాజరై, విధానపరమైన అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. తాజాగా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమైపోవడాన్ని మాత్రమే వెల్లడి చేస్తుంది. సాధారణంగా అధికార పక్షంపై అవసరమైన మెజారిటీ లేదనుకున్నప్పుడు లేదా వారి విధానాలపై తమ బలమైన అసమ్మతిని తెలియచేయడం కోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ఉంటారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లోక్‌సభలో సంపూర్ణ ఆధిక్యత ఉండడంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం ఏ మాత్రం లేదు. గతంలో వామపక్షాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని భారత్ అమెరికా అణు ఒప్పందం పట్ల తమకు గల విధానపరమైన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టాయి. అయితే, ఆనాడు ఈ విషయంలో ప్రభుత్వంపై విధానపరమైన విభేదాలు లేకపోయినప్పటికీ బిజెపి ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడం ద్వారా తమ అవకాశవాద రాజకీయ వైఖరిని వెల్లడి చేసుకుందనే విమర్శలకు లోనయింది.
ప్రస్తుతం మణిపూర్‌లో మూడు నెలలుగా సాగుతున్న హింసాకాండ, మారణ హోమం గురించి ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని కోరుతున్న ప్రతిపక్షాలు, ఆయన మౌనం విడనాడకపోవడంతో, కేవలం ఆయనను ఈ అంశంపై మాట్లాడేటట్లు చేయడం కోసం అవిశ్వాస తీర్మానం తీసుకు వస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని ఓ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పది రోజులుగా కోరుతున్నా అధికార పక్షం నుండి స్పందన లేకపోవడంతో ఈ తీర్మానం తీసుకొచ్చారు. స్వాతంత్య్ర భారత దేశంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు తీసుకొచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. కేవలం రెండు ప్రభుత్వాలు మాత్రమే ఇటువంటి తీర్మానాల కారణంగా పడిపోయాయి. ఒకటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కాగా, మరొకటి వాజపేయీ ప్రభుత్వం. వాస్తవానికి తీర్మానం ప్రతిపాదించే సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వానికి పార్లమెంట్ లో ఆధిక్యత ఉంది.అయితే అంతర్జాతీయ కుట్ర కారణంగా తీర్మానంపై అనుకులంగా మాట్లాడిన నేతలు సహితం మరుసటి రోజు వ్యతిరేకంగా ఓటు వేసిన విచిత్రమైన పరిస్థితులు చూశాము.
వాజపేయీ ప్రభుత్వం కేవలం ఒక ఓటు తేడాతో ఓటమి చెందింది. ఆనాడు వాజపేయీకి మద్దతు ప్రకటించిన మాయావతి వంటి వారు కొన్ని ఒత్తిడుల కారణంగా ఓటింగ్ సమయంలో మాట మార్చడంతో ఆ ప్రభుత్వం ఓటమి చెందింది. ఆ ఒక్క ఓటు సహితం ఆనాడు స్పీకర్‌గా వ్యవహరించిన బాలయోగి తొందరపాటు కారణంగా వాజపేయి కోల్పోయారు. ఆనాడు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగో ఓటు వేయవచ్చా? అనే ధర్మ సందేహం తలెత్తింది.ఈ విషయమై బాలయోగి సెక్రటరీ జనరల్ అభిప్రాయం అడిగారు. ఆయన ‘సంప్రదాయం ప్రకారం ఓటు వేయకూడదు. అయితే అది మీ విచక్షణ (స్పీకర్) ను బట్టి ఉంటుంది’ అంటూ ఓ కాగితంపై సూచన చేస్తూ రాసి పంపారు. దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాలయోగి ఆ కాగితంపై సెక్రటరీ జనరల్ చేసిన సూచనను పైకి చదివారు. దానితో గొమాంగో విచక్షణకు వదిలివేసిన్నట్లయింది. దానితో గొమాంగో ఓటు వేశారు.
అంటే ఆ రెండు సందర్భాలలో సహితం మొరార్జీ, వాజపేయీ ప్రభుత్వాలు ఒక విధంగా కుట్ర పూరితంగా అధికారం కోల్పోయాయి.సభలో తమకు మెజారిటీ లేదని గ్రహించిన చరణ్ సింగ్, చంద్రశేఖర్, మొదటిసారి ప్రధానిగా వాజపేయీ ఓటింగ్ వరకు వెళ్లకుండా తమ పదవులకు హుందాగా రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన తర్వాత మణిపూర్‌లో కేవలం ఇప్పుడే కాదని, గతంలో కూడా రోజుల తరబడి హింసాయుత సంఘటనలు జరిగాయని అంటూ ఒక విధంగా తమ ప్రభుత్వ నిష్క్రియాతత్వం లేదనే ధోరణిలో హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. అమిత్ షా స్వయంగా నాలుగు రోజుల పాటు అక్కడ పర్యటన జరిపి, వివిధ వర్గాలతో విస్తృతంగా సమాలోచనలు జరిపారు.
ఇప్పటికి కూడా హోం మంత్రిత్వ శాఖ కొందరు దూతల ద్వారా ఆ సమాలోచనలు కొనసాగిస్తున్నది. సత్వరం శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తున్నది. అక్కడ సుదీర్ఘ కాలంగా తెగల మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలు నెలకొనడంతో ఘర్షణలు జరుగుతున్నాయి. పైగా, అది సరిహద్దు రాష్ట్రం కావడంతో ఒక వంక మయన్మార్, మరోవంక చైనాలోని కొన్ని శక్తులు ఆజ్యం పోస్తున్నాయి. కానీ ప్రస్తుతం మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు బైటకు వస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతోనే మొదట్లో హింసాకాండ ప్రారంభమైనట్లు వెల్లడి అవుతున్నది. ఇంటర్నెట్ నిషేధం విధించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి రాకుండా దారుణమైన, అమానుషమైన అనేక ఘటనలు జరిగేందుకు అవకాశం కల్పించారు.
ఇప్పుడు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన్నట్లు వీడియో బైటకు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నది. దానిపై సిబిఐ విచారణకు ఆదేశించి, ఆ వీడియో తీసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వీడియో బైటకు రావడం ఓ కుట్ర అని స్వయంగా అమిత్ షా ఆరోపించారు. ఆ వీడియో బైటకు రాకుండా ఉంటే మణిపూర్‌లో జరుగుతున్న అమానుష ఘటనలు సమాధి అయి ఉండేవని ఆయన భావిస్తున్నారా? ఈ ఘటన జరగడానికి ప్రత్యర్థి తెగకు చెందిన ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు వీడియో ప్రచారం చేయడమని పోలీసులు చెబుతున్నారు. ఎప్పుడో ఢిల్లీ లోనో, మయన్మార్ లోనో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ కావించారు. నిజంగా అదొక విద్రోహ చర్య. ఉద్దేశపూర్వకంగా చేపట్టిన చర్య. అందుకు కారకులైన వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం దాదాపు మౌనం వహిస్తున్నది.
ప్రధాన మంత్రులు అందరిలో ఇందిరా గాంధీ ఎక్కువగా అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. ఆమె విషయంలో సహితం ఆమెను పార్లమెంట్‌కు వచ్చేటట్టు చేయడం కోసమే పలు సందర్భాలలో ఆమెపై అవిశ్వాస తీర్మానాలు తీసుకొచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు ప్రధాన మంత్రులు అందరూ ప్రతి రోజూ పార్లమెంట్‌కు హాజరయ్యే వారు. ప్రతిపక్షాలకు చెందిన వారు అత్యంత దారుణమైన భాషతో నిందలు వేస్తున్నా మన్మోహన్ సింగ్ మౌనంగా వింటూ కూర్చునేవారు. కానీ ఏనాడూ పారిపోలేదు. ఇందిరా గాంధీ సహితం మొదట్లో పార్లమెంట్‌కు క్రమం తప్పకుండా వచ్చేవారు. కానీ క్రమంగా ఆమె ప్రభుత్వం అనేక ఆరోపణలకు గురవుతూ ఉండటం, దేశం లో పలు ఉద్యమాలు చెలరేగుతూ ఉండడంతో ఆమె పార్లమెంట్ కు తప్పనిసరైతే గాని వచ్చేవారు కాదు. ప్రస్తుత ప్రధాని మోడీ సహితం ఈ విషయంలో ఆమెను అనుసరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
పార్లమెంట్ వద్ద తన ఛాంబర్‌లోనే వున్నప్పటికీ సమావేశాలకు అరుదుగా కానీ హాజరు కావడం లేదు. మణిపూర్ గురించి ఆయన మౌనం వహించడానికి సహితం బలమైన కారణాలు వున్నాయి. స్వయంగా ప్రధాని ఈ విషయమై మాట్లాడితే అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకుంటుంది.ప్రపంచ నాయకుల దృష్టిని ఆకట్టుకొంటుంది. అంతర్జాతీయంగా విశేష ప్రజాదరణ గల నేతగా ప్రచారం పట్ల ఆసక్తి చూపుతున్న ఆయన ఇటువంటి ప్రతికూల ప్రచారానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న సమయంలోనే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ మణిపూర్ హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఇబ్బందిపడ్డారు. స్వయంగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హింసాకాండ వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని ప్రకటించినా కేంద్ర మంత్రు లు ఎవ్వరూ స్పందించకపోవడం గమనార్హం. అందుకనే పార్లమెంట్‌లో ఈ అంశంపై ప్రకటన చేసేందుకు ప్రధాని వెనుకడుగు వేస్తున్నారు. హోం మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం చెబుతోంది.
ఏదేమైనా ఈశాన్య రాష్ట్రాలలో శాంతిని నెలకొల్పడం తమ ప్రభుత్వం సాధించిన అతి గొప్ప విజయంగా అమిత్ షా తరచూ చెబుతున్న మాటలను ఇప్పుడు మణిపూర్ ఘటనలు ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. కేవలం తెగల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక ఘర్షణలు కాకుండా, సరిహద్దు అవతల నుండి ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణా సహితం అక్కడి పరిస్థితులకు ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ అక్రమ రవాణా వెనుక బలమైన రాజకీయ నేతలు సహితం ఉన్నారని, వీటి అక్రమ రవాణా విషయంలోనే అక్కడి గిరిజన తెగల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు హింసాకాండకు దారి తీస్తుందని కూడా చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంలోని పెద్దలు తమ అక్రమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఒక వర్గానికి బాసటగా ఉంటూ ఉండడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతున్నాయి.

-చలసాని నరేంద్ర, 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News