Monday, December 23, 2024

మా కూటమిలో గందరగోళం లేదు: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

బారామతి: ఎన్‌సిపి తిరుగుబాటు నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో తాను పుణెలో సమావేశం కావడంపై మహా వికాస అఘాడి(ఎంవిఎ) కూటమిలో ఎటువంటి గందరగోళం లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం స్పష్టం చేశారు.

ఎంవిఎ సమైక్యంగా ఉందని, ఆగస్టు 31న ముంబైలో జరగనున్న ప్రతిపక్ష ఇండియా కూటమి తదుపరి సమావేశం విజయవంతం అవుతుందని బారామతిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. జులై 2న అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన తర్వాత శరద్ పవార్ తన స్వస్థలానికి రావడం ఇదే మొదటిసారి.

శరద్ పవార్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ మధ్య జరిగే ఇటువంటి సమావేశాలు రాజకీయ వర్గాలలో గందరగోళకం ఏర్పరుస్తాయని, దీనిపై వివరణ స్పష్టత ఇవ్వాలని ఎంవిఎ భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ఇప్పటికే శరద్ పవార్‌ను కోరాయి.

ఎంవిఎ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి గందరగోళం లేదని, పదే పదే ఇదే ప్రశ్న అడిగి మరింత గందరగోళం సృష్టించవద్దని శరద్ పవార్ మీడియాకు సూచించారు. ఇండియా కూటమి సమావేశాన్ని ముంబైలో నిర్వహించే బాధ్యతను తాను, ఉద్ధవ్ థాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలె తీసుకున్నామని ఆయన చెప్పారు.

ముంబైలోని ఒక స్టార్ హోటల్‌లో ఈ సమావేశం జరగనున్నది. మనీ లాండరింగ్ కేసులో రెండు నెలల బెయిల్‌పై విడుదలైన ఎన్‌సిపి నాయకుడు నవాబ్ మాలిక్‌తో తాను భేటీ కానున్నట్లు పవార్ చెప్పారు. తనకు, అజిత్ పవార్‌కు మధ్య తరచు జరుగుతున్న సమావేశాలపై శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో వ్యక్తం చేసిన అసంతృప్తిపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News