Monday, January 20, 2025

ప్రధాని కావాలన్న కోరిక లేదు

- Advertisement -
- Advertisement -

No desire to become Prime Minister:Nithish kumar

ప్రతిపక్షాల ఐక్యతే ప్రధాన అజెండా
మరోసారి స్పష్టం చేసిన బీహార్ సిఎం నితీశ్
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ
కేజ్రీవాల్, డి. రాజాలతోనూ సమావేశం

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిలిచే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై ఆయన మరోసారి స్పందించారు. ‘ నేనేమీ హక్కుదారును కాదు. కనీసం ఆ కోరిక కూడా నాకు లేదు’ అని మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నితీశ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న నితీశ్ కుమార్ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో మంగళవారం సమావేశం అయ్యారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. బిజెపితో సంబంధాలు తర్వాత నితీశ్ ఢిల్లీ రావడం,పలువురు విపక్ష నేతలతో సమావేశం కావడం ఇదే మొదటిసారి. తొలుత సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమైన నితీశ్ ఆ మరుసటి రోజే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. సిపిఐ కార్య్లాలయంలో ఆ పార్టీ కార్యదర్శి డి రాజాతో కూడా కలుసుకున్నారు. ఏచూరితో తన సమావేశంపై నితీశ్ మాట్లాడుతూ వామపక్ష పార్టీలు, వివిధ ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపైకి వస్తే అదో పెద్ద విషయం అవుతుందన్నారు.

తన చిన్ననాటినుంచే సిపిఎంతో తనకు సంబంధం ఉందని, తాను ఎప్పుడు ఢిల్లీ వచ్చినా సిపిఎంకార్యాలయానికి వస్తూ ఉంటానని ఆయన చెప్పారు. ఈ రోజు తాము మళ్లీ కలిశామని చెప్పారు. వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్‌ను సంఘటితం చేయడంపైనే తమ మొత్త దష్టి ఉందని, తామంతా ఒక్కటైతే అదే పెద్ద విషయమవుతుందని ఆయన చెప్పారు. మీరు ప్రధాని కావాలనుకుంటున్నారా? అని ఓ విలేఖరి ప్రశ్నించగా అది నిజం కాదనితీశ్ అన్నారు. ‘ఆ పదవికి నేను హక్కుదారుడిని కాను, అంతేకాదు, నాకు ఆ కోరిక కూడా లేదు’ అని ఆయన చెప్పారు. నితీశ్ మళ్లీ ప్రతిపక్షాల కూటమి వైపు రావడం, బిజెపి వ్యతిరేక పోరాటంలో భాగస్వామి కావాలనుకోవడం భారతీయ రాజకీయాలకు మంచి సంకేతమని సీతారాం ఏచూరి అన్నారు. ఆయన మరోసారి సిపిఎం కార్యాలయానికి రావడం సంతోషకరమన్నారు. ‘ మొదట బిజెపియేతర పార్టీలను ఏకం చేయడం మా అజెండా, ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదు. సమయం వచ్చినప్పుడు మేము ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాం అప్పుడు మీడియాకు చెబుతాం’ అని ఏచూరి చెప్పారు.

కేజ్రీవాల్‌తో భేటీ

నితీశ్ కుమార్ ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమైనారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జెడి(యు) నేత సంజయ్ ఝా ఈ సమావేశాలన్నిటిలోను నితీశ్ వెంట ఉన్నారు. తన నివాసానికి వచ్చిన నితీశ్‌కు కేజ్రివాల్ కృతజ్ఞతలు తెలిపారు. విద్య, వైద్యం, ఆపరేషన్ లోటస్, ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చడానికి బహిరంగంగా ఎంఎల్‌ఎలతో బేరసారాలు సాగించడం, నిరుద్యోగం, బిజెపి ప్రభుత్వాల అవినీతి లాంటి ఎన్నో విషయాలను తాము చర్చించినట్లు కేజ్రివాల్ ఓ ట్వీట్‌లో తెలియజేశారు. తన పర్యటనలో నితీశ్ కుమార్ జెడి(ఎస్) నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిని కూడా కలుసుకోనున్నారు. నితీశ్ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News