కొత్తగూడెం : తొమ్మిదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని బిఎస్‌పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ ఆరోపించారు. మునిసిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు బూడిదగడ్డలో ఆదివారం ఇంటింటికి బిఎస్‌పి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విఫమలయ్యారని విమర్శించారు.
మునిసిపల్ చట్టాలకు వ్యతిరేకంగా చైర్ పర్సన్ వాహనానికి అద్దె చెల్లిస్తున్నారని, ఇది సరైంది కాదని, చైర్‌పర్సన్ వాహనానికి అద్దె చెల్లింపు పై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. అధికార బిఆర్ ఆగడాలను ఎండకడుతూ బిఎస్‌పి పార్టీ పోరాటాలు చేస్తూనే ఉందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క బిఎస్‌పి పార్టీకే ఉందని అన్నారు. ప్రజలు విజ్ఞతతో తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లిఖార్జున్‌రావు, జిల్లా కార్యదర్శి చెనిగరపు నిరంజన్ కుమార్, అల్లకొండ శరత్, జర్పుల కళ్యాణ్, గుగులోత్ కళ్యాణ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.