Thursday, November 21, 2024

నేను వద్దన్నా సిఎం పదవి నన్ను వదలడం లేదు: గెహ్లాట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదిలివేయాలని తాను భావిస్తున్నప్పటికీ అది తనను వదలడం లేదని, బహుశా అది తనను వదలకపోవచ్చని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వృద్ధ నాయకుడు అశోక్ గెహ్లాట్ అన్నారు.

గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి సారథ్యం వహించే అవకాశాన్ని పార్టీ అధిష్టానం తనకు మూడుసార్లు అప్పగించడానికి కారణం తనలో ఏదో ఉండి ఉండవచ్చని, ఏదేమైనా ఈ విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని అందరికీ ఆమోదయోగ్యం ఉంటుందని అన్నారు.

2020లో అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ నేతృత్వంలో గెహ్లాట్ ప్రభుత్వం తిరుగుబాటును ఎదుర్కోవలసి వచ్చింది. అయితే పార్టీ అధిష్టానం జోక్యంతో అసమ్మతి మంటలు చల్లారిపోయాయి. అప్పటి పరిణామాలను గెహ్లాట్ ప్రస్తావిస్తూ మన్నించడం, మరచిపోవడం అనే విధానాన్ని అవలంబించి తాను ముందుకుపోయానని చెప్పారు.

ప్రతిపక్ష నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను శాఖ జరుపుతున్న దాడుల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎన్నికల ప్రవర్తనావళి అమలులో ఉన్నందున వెంటనే వీటిని ఆపడానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
పార్టీ టికెట్ల కేటాయింపుపై పార్టీలో విభేదాలు ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు ఎటువంటి విభేదాలు లేవని, ఏకాభిప్రాయంతోనే అన్ని నిర్ణయాలు జరుగుతున్నాయని గెహ్లాట్ చెప్పారు.

ఇదిలా ఉండగా… అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్వహించిన సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 25న జరగనున్నది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News