Saturday, January 25, 2025

మాంద్యం ముప్పు మనకు లేదు

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు వ్యవసాయమే వెన్నెముక గ్రామాల్లో పెరిగిన ఎకనమిక్ యాక్టివిటీ
బలంగా ఉన్న గ్రామీణ ఆర్థ్ధిక వ్యవస్థ పెట్రోల్, ఎరువులపైనే కొద్దిపాటి ప్రభావం?

మన తెలంగాణ /హైదరాబాద్: ప్రపంచ దేశాలను కలవరపెడు తున్న ఆర్థిక మాంద్యం ప్రభావం దేశంపై ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రంపై మాత్రం పెద్దగా ఉండదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు ధీమాగా ఉన్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపైనే 70శాతం మంది ప్రజలు ఆధారపడటం మూలంగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మూలంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని, అదే ఇప్పుడు ఆర్థిక మాంద్యం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజానీకాన్ని కాపాడుతుందని ప్రభుత్వంలోని సీనియర్ ఐఎఎస్ అధికారులు ధీమా చేస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలోని ఆర్థిక నిపుణుల దగ్గర్నుంచి చివరకు ప్రపంచ బ్యాంకు కూడా ఈ ఏడాది చివరికల్లా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారవర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం ఆఫ్రికా, యూరఫ్ దేశాలు, అమెరికా దేశాలపైన మాత్రమే ఉంటుందని, ఆసియాలోని భారతదేశం, చైనా, జపాన్ దేశాలు మినహా మిగతా అన్ని దేశాలపైన మాంద్యం ప్రభావం ఉండవచ్చునని అం టున్నారు. మహా అయితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి, దాని మూలంగా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల్లో మరింత పెరుగుదల ఉండవచ్చునని, అంతేగాక పెట్రో ఉత్పత్తులపైన ఆధారపడిన ఎరువులపైన కొద్దిగా ప్రభావం చూపవచ్చునని, అంతకు మించి ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశంపైన గానీ తెలంగాణ రాష్ట్రంపైన గానీ పెద్దగా ప్రభావం చూపదని ఆ అధికారులు ధీమాగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఒక కోటి 36 లక్షల ఎకరాల్లో పంటలను సాగుచేస్తుండటం, అందులో ఒక్క వరిపైరునే 64 లక్షల 54 వేల ఎకరాల్లో తెలంగాణ రైతన్నలు సాగుచేస్తుండటం వంటివి రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తాయని అంటున్నారు. అంతేగాక, రైతుబంధు, పెన్షన్లు, దళితబంధు వంటి పథకాలతో ప్రజలకు ఆర్థికంగా ప్రభుత్వం సహకరించడంతో ఈ మాంద్యం నుంచి ప్రజలకు ఎలాంటి కష్టం ఉండదని భావిస్తున్నామని ఆ అధికారులు వివరించారు. అంతేగాక హైదరాబాద్ కేంద్రంగా ఐటి ఎగుమతులు, ఫార్మా ఇండస్ట్రీ ఎగుమతులన్నీ ప్రపంచంలోని మారుమూల దేశాలకు కూడా వెళుతుండటం, అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా ఊహించని అభివృద్ధిని సాధించడం కూడా తెలంగాణ రాష్ట్రానికి కలిసివచ్చిన అంశాలని అంటున్నారు. అంతేగాక రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ నిర్మాణాల్లో కార్మికలోకానికి చేతినిండా పనులు లభిస్తుండటం మూలంగా రాష్ట్రంలో గడచిన ఆళ్లుగా ఎకనమిక్ యాక్టివిటీ (ఆర్థిక కార్యకలాపాలు) గణనీయంగా పెరగడంతో ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైన అంతగా ఉండదని అంటున్నారు.

దీనికితోడు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాలకు ఫార్మాస్యూటికల్ ఎగుమతులు భారీగా పెరిగాయని, 2016లో కేవలం 17,744 కోట్ల రూపాయలున్న ఫార్మా ఎగుమతులు నేడు రికార్డుస్థాయిలో 13 బిలియన్ డాలర్ల (1,05,300 కోట్లు)కు పెరిగిందని, తద్వారా పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతోందని వివరించారు. ఇక ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో కూడా ఎగుమతులు రికార్డుస్థాయిలో పెరిగాయని వివరించారు. 2016వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 400వరకూ ఉన్న ఐటి కంపెనీల సంఖ్య నేడు 1500లకు పెరిగిందని, ఐటి కంపెనీల్లో ఏకంగా 7,78.121 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఐటి ఎగుమతులు 23 బిలియన్ డాలర్ల (1,86,300 కోట్లు) కు పెరిగిందని తెలిపారు. ఇలా వ్యవసాయం, ఫార్మా, ఐటి, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, మెడికల్ టూరిజం మూలంగా సాధించిన ప్రగతి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అన్ని విధాలుగా దోహదపడుతూనే ఉంటుందని, అందుచేత రానున్న ఆర్ధిక మాంధ్యం ప్రభావం పెద్దగా ఉండదని ఉన్నతాధికారులు ధీమా చేస్తున్నారు. వ్యవసాయ రంగం మూలంగా ఆహారధాన్యాల కొరత సమస్యే తలెత్తే పరిస్థితులు లేవని అంటున్నారు. దీనికితోడు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణాల మూలంగా కూడా కార్మికులకు ఉపాధి లభిస్తుండటం మూలంగా ఎవ్వరూ ఖాళీగా లేరని, అంతేగాక ఉపాధి కోసం బీహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కార్మికులు తెలంగాణకు వస్తున్న సంగతిని గుర్తు చేస్తున్నారు.

ఇలాంటి సానుకూలాంశాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు. ఆర్థిక మాంద్యం వంటివి రాకముందు, రాష్ట్ర విభజన జరుగకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉన్న తెలంగాణలో 2014కు ముందున్న పరిస్థితులే ఉండే రాష్ట్రంలో పరిస్థితి ఎంతో ఘోరంగా ఉండేదని, ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడటం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలు, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటి, ఫార్మా, రియల్ ఎస్టేట్, వైద్యం… ఇలా ఒక్కటేమిటీ అన్ని రంగాల్లోనూ సమగ్రమైన అభివృద్ధిని సాధించడం మూలంగానే రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసుకోగలిగామని, వీటిన్నింటి మూలంగా బడ్జెట్‌లో కూడా రెవెన్యూ మిగులును ప్రవేశపెట్టుకోవడం జరిగిందని ఆ అధికారులు వివరించారు. అందుచేతనే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఆర్థిక మాంద్యం రాబోతోందని హెచ్చరించినా తాము మాత్రం నిశ్చింతగా ఉండగలుగుతున్నామని వివరించారు.

No Economic Crisis in Telangana: TS Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News