పిల్లల మధ్యాహ్న భోజనంపై కర్నాటక కమిటీ
బెంగళూరు/న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పిల్లల మధ్యాహ్న భోజనం పూర్తిగా శాకాహారంగా ఉండాలని, గుడ్లు, మాంసం వంటివి ఇందులో ఉండరాదని కర్నాటకకు చెందిన ఓ విద్యా కమిటీ సిఫార్సు చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)కి చెందిన ఈ కమిటీ చేసిన సిఫార్సులను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. పేదపిల్లలకు పౌష్టికాహారం వద్దంటారాఅని ప్రశ్నించాయి. కర్నాటకలో 80 శాతంపైగా ప్రజలు గుడ్లు లేదా మాంసాహారం తీసుకుంటారు. అయితే కర్నాటకకే చెందిన ఎన్‌ఇపి కమిటీ ఈ మాంసాహారం నిషేధించాలని సూచించింది. మధ్యాహ్న భోజనంలో వీటిని తొలిగించాలని తెలిపింది. పిల్లలకు మాంసాహారం పలు రకాల జబ్బులు తెచ్చిపెడుతుందని తెలిపిన కమిటీ దేశవ్యాప్తంగా పిల్లల మధ్యాహ్నభోజనం కేవలం శాకాహారంతో ఉండాలని సూచించింది. ఇటీవలి జీవనసరళి అవకతవకలన్నింటికి మూలమైన కారణాలను విశ్లేషించుకోవాలని, అందుకు అనుగుణంగానే భోజన అలవాట్లు ఉండాలని ప్యానల్ తెలిపింది. ఎగ్ వద్దు మాంసం మరీ వద్దు అని పేర్కొంటూ ఈ విద్యా నిపుణుల కమిటీ పలు ప్రతిపాదనలు పంపించింది.
అయితే కొందరి సిద్ధాంతాలను చివరికి ఈ విధంగా పిల్లల పౌష్టికాహారం భోజన పథకంలోకి కూడా జొప్పించేందుకు యత్నించడం దారుణం అని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే ఈ విమర్శలపై కర్నాటక కేబినెట్ మంత్రి సిఎన్ అష్వత్ నారాయణ్ తీవ్రంగానే స్పందించారు. ఈ కమిటీ ప్రతిపాదనలు మంచివే అనుకుంటా, వివాదాలేమి లేవు. ఏది ఏమైనా ప్యానల్ ఏర్పాటు అయ్యేదే సూచనలు ప్రతిపాదనలు వెలువరించేందుకు, ఇందులో తప్పేముంటుంది. సిఫార్సులు వెలువడుతాయి. వీటిని పరిశీలించి ప్రజలకు ఏది బాగు ఏదీ కాదనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.