పురూలియా (పశ్చిమబెంగాల్): 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని, హింస, ద్వేష రాజకీయాలతో పేట్రేగుతున్న బిజెపికి 2024 ఎన్నికల్లో ఎంట్రీ ఉండబోదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. పురూలియాలో మంగళవారం టీఎంసీ వర్కర్ల సమావేశంలో ఆమె బిజెపి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం లోని బీజేపీ సర్కార్ కల్తీమయంగా మారిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. నోట్ల రద్దు లాంటి చర్యలతో దేశాన్ని అస్తవ్యస్థం చేశారని , దర్యాప్తు ఏజెన్సీలతో విపక్షాలను టార్గెట్ చేస్తున్నారని, సిబిఐ, ఇడి దర్యాప్తు సంస్థలు మొట్టమొదట అవినీతి బిజెపి మంత్రులను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లాలూ ప్రసాద్, సత్యేంద్ర జైన్ వంటి విపక్షాల నేతలను అరెస్టు చేయడానికే ఆ సంస్థలు ఉపయోగపడుతున్నాయని, మరి బిజెపి మంత్రుల సంగతేమిటని ఆమె ప్రశ్నించారు.
నోట్ల రద్దు అనేది పెద్ద స్కామ్ అని, బొగ్గుగనుల లూటీ, పశువుల అక్రమ రవాణా అంటూ స్కామ్‌ల్లో కొంతమంది ప్రజలను ఇరికిస్తున్నారని ఆమె కేంద్ర పభుత్వంపై ఆరోపించారు. కేంద్రం లోని ప్రజావ్యతిరేక ప్రభుత్వంతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని, అందువల్ల మళ్లీ బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఆమె పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చాలావరకు రావలసి ఉందని, ఈ విషయంలో కేంద్ర వివక్షకు నిరసనగా జూన్ 5, 6 తేదీల్లో రాష్ట్రం మొత్తం మీద టిఎంసి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. వెనుకబడిన పురూలియా జిల్లాలో రాష్ట్రప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వంపై కానీ అధికార పార్టీపై కానీ ప్రజలకు కోపం లేదని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
No entry for BJP in Lok Sabha Polls: Mamata Banerjee