ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లోకి బయటి వ్యక్తులు, ప్రజా ప్రతినిధుల ప్రవేశంపై నిషేధాన్ని అధికార యంత్రాంగం డిసెంబర్ 10వ తేదీ వరకు పొడిగించడంతో సంభాల్ ఎంపితోసహా పలువురు సమాజ్‌వాది పార్టీ ప్రజాప్రతినిధులను సంభాల్‌లోకి రాకుండా పోలీసులు శనివారం అడ్డుకున్నారు. సంభాల్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధః శణివారం ముగియనున్న తరుణంలో శాంతి భద్రతలను పరిరక్షించే కారణంపై పాలనా యంత్రాంగం దీన్ని పొడిగించింది.
ఘజియాబాద్ నుంచి వస్తున్న సమాజ్‌వాది పార్టీ ముజఫర్‌నగర్ ఎంపి హరేంద్ర మాలిక్‌ను సంభాల్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు నిలిపివేశారు. తమను ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని మాలిక్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోపల తిరగడానికి కూడా ఎంపీలను అనుమతించడం లేదని, తాము అంత బాధ్యతారహితులమా అని ఆయన ప్రశ్నించారు. షాహీ జామా మసీదు సర్వేకు కోర్టు ఆదేశించిన దరిమిలా సంభాల్‌లో జరిగిన హింసాకాండ గురించి సమాచారం సేకరించడానికి 15 మంది సభ్యుల ప్రతినిధి బృందాన్ని సమాజ్‌వాది పార్టీ నియమించింది.