పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 1 నుంచి 9 తరగతుల వరకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తూ ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతుల వరకు పరీక్షలు లేకుండానే పాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు, లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి నుంచి దాదాపు 11 నెలల పాటు బడులు మూతబడి ఉన్నాయి. కరోనా కేసులు కొంచెం తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి ఆపైన తరగతులకు, ఫిబ్రవరి 24 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాథమిక తరగతులకు మాత్రం ఈ విద్యాసంవత్సరం ప్రత్యక్ష బోధన ప్రారంభం కాలేదు. సుమారు 20 రోజులపాటు ఈ తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహించారు.
కానీ పాఠశాలల్లో మళ్లీ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో మళ్లీ గత నెల 24 నుంచి విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్షలు నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరుగుతాయా..? లేక గత ఏడాది మాదిరిగా అందరినీ పాస్ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థలు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ తరగతులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని తరగతులకు పరీక్షలు నిర్వహిస్తారా..? లేక కొన్ని తరగతులకే నిర్వహిస్తారా..? అని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 6,7,8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. నెల తర్వాత పరిస్థితులను బట్టి 9వ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మే నాటికి కరోనా కేసులు, ఇతర పరిస్థితులను పరిశీలించి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈసారి ప్రాథమిక తరగతుల విద్యార్థులకు కేవలం ఆన్‌లైన్ తరగతులు మాత్రమే కొనసాగగా, 6,7,8 తరగతుల విద్యార్థులకు 20 రోజుల పాటు ప్రత్యక్ష బోధన కొనసాగింది. ఈ నేపథ్యంలో 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ విద్యా శాఖ పరిధిలోని 8,891 పాఠశాలల్లో 8,88,742 మంది, 10,275 ప్రైవేట్ పాఠశాలల్లోని 8,28,516 మంది విద్యార్థులు, వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న 1,157 గురుకుల విద్యా సంస్థల్లో 1,98,853 మంది విద్యార్థులు 6,7,8 తరగతులు చదువుతున్నారు. 6,7,8 తరగతులను పరీక్షలు లేకుండా పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 17.10 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.