మధ్యంతర బెయిల్‌పై సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల కోసం ప్రచారం చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంలో తాము ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. తీర్పుకు సంబంధించి విమర్శనాత్మక విశ్లేషణను ఆహ్వానిస్తామని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కొందరు చేసిన ప్రకటనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి), కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వాద ప్రదివాదనలు చేయడానికి ప్రయత్నించగా వాటిని పరిగణనలోకి తీసుకోవడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
ఎవరికీ ఎటువంటి ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి గల న్యాయపరమైన కారణాలను మా ఉత్తర్వులో పొందుపరిచాము. మా తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణను ఆహ్వానిస్తాము అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇడి తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్నికల ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్ చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. ఆప్‌కు ఓటేస్తే తాను జూన్ 2న మళ్లీ తీహార్ జైలుకు వెళ్లనవసరం లేదని కేజ్రీవాల్ చేస్తున్న ప్రసగాలను ఆయన ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ& అది ఆయన(కేజ్రీవాల్) ఊహ..దానిపై మేమేమీ చెప్పలేము అని ధర్మాసనం తెలిపింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం అసాధారణమంటూ ఒక సీనియర్ కేంద్ర మంత్రి(అమిత్ షా) చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ప్రస్తావించారు. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.