పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులలో కొందరికి నిరాశ మిగిలింది. జీవితంలో ఈ చాన్స్ మిస్సయింది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ పరీక్షలు రాసేందుకు తుది అవకాశం ఉండి, కొవిడ్ ఉధృతితో పరీక్షలకు వెళ్లలేకపోయిన వారికి అదనపు అవకాశం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు సర్వోత్తమ న్యాయస్థానం బుధవారం సంబంధిత పిటిషన్‌ను తిరస్కరించింది. కరోనా దశలో తాము పరీక్షలకు సరైన విధంగా సిద్ధం కాలేకపొయ్యామని, తమకు వయస్సు రీత్యా తుది గడువు అని తెలిసినా కరోనా ఉధృతి దశలో సరైన విధంగా ఏర్పాట్లు లేకపోవడంతో పరీక్షలకు వెళ్లలేకపొయ్యామని, తమకు మరోసారి సివిల్ పరీక్షకు అవకాశం కల్పించాలని ఐఎఎస్ ఆశావహులు పిటిషన్లో కోరారు. దీనిని న్యాయమూర్తులు ఎఎం ఖాన్విల్కర్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. వీరికి మరోసారి పరీక్షకు అవకాశం కల్పించినట్లు అయితే పోటీ పరీక్షలకు హాజరయ్యే ఇతర అభ్యర్థుల పట్ల విచక్షణ చూపినట్లు అవుతుందని, వీరి అవకాశాలు దెబ్బతీసినట్లు అవుతుందని కేంద్రం ఈ నెల 9వ తేదీన న్యాయస్థానానికి తెలియచేసుకుంది.
పైగా సివిల్ సర్వీస్ ఉద్యోగాలు, శిక్షణలకు సంబంధించి పలు విధాలుగా విధివిధానాలలో చిక్కులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం పటిషన్‌ను తిరస్కరించింది. యుపిఎస్సి పరీక్షలకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 32 సంవత్సరాల వయస్సు వరకూ ఆరుసార్లు పరీక్షలు రాసేందుకు అర్హులు. ఒబిసిలు తొమ్మిది సార్లు, 35 సంవత్సరాల పరిమితి వరకూ పరీక్షకు వెళ్లవచ్చు. ఇక ఎస్సి/ఎస్టి అభ్యర్థులు 37 ఏండ్ల వరకూ ఎన్నిసార్లు అయినా సివిల్ సర్వీస్ పరీక్షలు రాయవచ్చు. సివిల్ ఆశావహులు రచన ఇతరులు పెట్టుకున్న పిటిషన్‌కు సంబంధించి ముందు కేంద్రం అదనపు అవకాశం ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేయలేదు. అయితే కరోనా అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వయో పరిమితి పరిగణనల నేపథ్యంలో చిట్టచివరికి అవకాశాన్ని ఇచ్చేందుకు న్యాయస్థానం సూచించడంతో సమ్మతించింది. అయితే న్యాయస్థానం బుధవారం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. అవకాశాన్ని ఇవ్వడం కుదరదని పేర్కొంది. దేశంలో గత ఏడాది కొవిడ్ ఉధృతి, ఇదే సమయంలో వరదల తీవ్రత మధ్యలోనే యుపిఎస్సి ప్రిలిమనీ పరీక్షలు జరిగాయి. వీటిని వాయిదా వేయాలనే పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన తోసిపుచ్చింది.