మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ సర్కార్ మంగళవారంనాడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024 బడ్జెట్ (2024-25) ముఖ్యంగా ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్‌ఎంఇ రంగాలపై దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తం 9 ప్రాధాన్యతా రంగాలను బడ్జెట్ ప్రసంగంలో వివరిచారు. రికార్డు స్థాయి లో ఆర్థిక మంత్రి వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 48.21 లక్షల కోట్లు బడ్జెట్‌ను ప్రకటించారు. తెలంగాణకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వకుండా కేంద్రం తొక్కిపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. ఈసారి బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాలూ ఆశలు పెట్టుకున్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎపి, తెలంగాణ విభజన నాటి హామీలు అమలు చేస్తారని ఎంతగానో ఎదురుచూశారు. కానీ కేంద్ర బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. కానీ ఎపికి లాభం చేకూరింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్‌లో ఒరిగేదేమిటి కేవలం గుండు సున్నా మాత్రమే. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. తెలంగాణ ఏర్పడిననాటి నుంచి కీలకమైన విభజన హామీలు, పారిశ్రామిక రంగంలో న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఇంకా కొనసాగుతున్నది. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ ఎపి, బీహార్ బడ్జెట్ లాగా ఉంది. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో ఇంతవరకు అతీగతీ లేదు. రైలు కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు ఇప్పటివరకు పెండింగ్‌లోనే వున్నాయి. తెలంగాణ హామీలపైన ఉలుకుపలుకు లేదు.
పారిశ్రామిక కారిడార్ స్పందన లేదు. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి గత ఏడు నెలలుగా కేంద్ర మంత్రులను కలిసినా తెలంగాణకు దక్కింది శూన్యమే. తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఇచ్చింది గుండు సున్నా. తెలంగాణలో ఉన్న బిజెపి అక్కరకురాని చుట్టమని కెసిఆర్ గతం లో అభివర్ణించారు. అది ముమ్మాటికీ నిజం చేస్తున్న తెలంగాణ బిజెపి ఎంపిలు. బిజెపి అగ్రనాయకులు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి నూరు నినాదాలు, హామీలు ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో నిత్యం వివక్ష చూపిస్తున్నారు. బిజెపి కేంద్రంలో అధికారం వచ్చిన తరవాత పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్ ధర పెరిగాయి. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ‘మేకిన్ ఇండియా’ తెలంగాణ భాగం కదా? దళితుల బతుకులు, పేదల బతుకులు మారేదిఎప్పుడు? 16 లోక్‌సభ స్థానాల్లో 8 కాంగ్రెస్, 8 బిజెపి దక్కించుకున్నా యి. ఎపిలో 16 మంది ఎంపిలతో కేంద్రాన్ని శాసిస్తున్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా నోరు మెదపలేదు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయింపుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామంటూ బడ్జెట్ 202425 ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీతారామన్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. విశాఖ- చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. ఇక విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ మాట పలకడానికి ఆర్థిక మంత్రి ఇష్టపడడం లేదు అనుకుంట? ఏ దేశ అభివృద్ధిలోనైనా రవాణా అత్యంత కీలకం. తక్కువ ఖర్చు తో ప్రయాణాలకు, వస్తు రవాణాకు రైల్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ తెలంగాణ ప్రాంతంలో పదేళ్లలో రైల్వేలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే.
రైల్వే నెట్‌వర్క్ విషయంలో అత్యంత వెనుకబడిన తెలంగాణకు బడ్జెట్‌లో తక్కువ నిధులే వస్తున్నాయి. రాష్ట్రానికి ఇప్పటి వరకూ 30 రైల్వే ప్రాజెక్టులు మంజూరైనా అవి కార్యరూపం దాల్చాలంటే కనీసం రూ. 85 వేల కోట్లు అవసరమని అంచనా. కానీ, గత సంవత్సరం బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 4,418 కోట్లే కేటాయించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండటంతో బడ్జెట్ కేటాయింపులపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. తెలంగాణలో ప్రస్తుతం అమృత్ భారత్ కింద 21 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నారు. ఇందుకోసం భారీగా నిధులు అవసరం. మొదట లింగంపల్లిని హబ్‌గా చేయాలని భావించినా నిధుల లోటుతో ఆ ప్రతిపాదన మూలనపడింది. ఇక కాజీపేటలో వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్‌కు నిధులు ఇవ్వాల్సి ఉంది.
తెలంగాణలో లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలను రైలు మార్గంతో అనుసంధానిస్తామంటూ గతంలో కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందుతో పోల్చితే తుది లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) పూర్తయిన ప్రాజెక్టుల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఇప్పటికీ నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నారాయణపేట వంటి జిల్లా కేంద్రాలకు రైలు మార్గం లేదు. గత పదేళ్లలో రూ. 10,912 కోట్ల విలువైన 5 ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టులు మాత్రమే మంజూరయ్యాయి. తెలంగాణ అవసరాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. కొడంగల్ మీదుగా వికారాబాద్ కృష్ణా మార్గంలో 122 కి.మీ కొత్త రైలు మార్గానికి సంబంధించి 2010లోనే సర్వే పూర్తయింది. రూ.787 కోట్లు అవసరమని అంచనా వేశారు. తెలంగాణ నుంచి గోవా వెళ్లేందుకు ఇది దగ్గరి దారి. రైల్వే బోర్డుకు 2012లో నివేదిక ఇవ్వగా, 2023 సెప్టెంబరులో ఎఫ్‌ఎల్‌ఎస్‌కు అనుమతులు వచ్చాయి.
ఈ పదేళ్లలో అంచనా విలువ సుమారు రూ. 2,196 కోట్లకు పెరిగింది. శంషాబాద్ – విజయవాడ సెమీ హైస్పీడ్ కారిడార్ సర్వేకు రైల్వేబోర్డు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో గంటకు 220 కి.మీ గరిష్ఠ వేగంతో రైళ్లు ప్రయాణించే అవకాశం కనిపిస్తున్నాయి. ఇంకా ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే జరుగుతుంది. కరీంనగర్ – హసన్‌పర్తి మధ్య 62 కి.మీ కొత్త రైలుమార్గం సర్వే నివేదిక 2013లో రైల్వేబోర్డుకు పంపించారు. అప్పట్లో దాని అంచనా వ్యయం రూ. 464 కోట్లు. ఇప్పుడు రూ. 1,116 కోట్లకు చేరింది.
సికింద్రాబాద్ – కాజీపేట మార్గంలో ప్రస్తుతం రెండు లైన్లు ఉన్నాయి. 85.48 కి.మీ మూడో లైను నిర్మాణం కోసం 2014లో సర్వే పూర్తయితే 2018లో ప్రాథమిక సర్వే నివేదిక తయారైనా ఉలుకూలేదు. బీబీనగర్‌గుంటూరు డబ్లింగ్‌కు నిధులు కేటాయించలేదు. ఎంఎంటీఎస్ 2 విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మాణ వ్యయం పూర్తిగా భరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుబంధంగా 564 కి.మీ రీజినల్ రింగ్ రైల్ లైన్ నిర్మించనున్నట్లు కేంద్రం గత సంవత్సరం ప్రకటించింది. రూ. 14 కోట్లు మంజూరు చేసినా, ఇంకా సర్వే మొదలవలేదు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ. 12,408 కోట్లుగా పేర్కొన్నారు.
ప్రతి బడ్జెట్ లో రాష్ట్రానికి మేలు చేసే కేటాయింపులు జరపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదు. అయితే ఈసారి బిజెపికి తెలంగాణలో 8 ఎంపి సీట్లు వచ్చానా అదే వివక్ష. గత ఎన్నికలో కేంద్రంలో గెలిచే ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించారు. అందుకే బిజెపికి 8 సీట్లు ఇచ్చారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం బిజెపి ఎంపిలు మోడీతో మాట్లాడి ఏం మేలు చేసేలా చేస్తారో వేచి చూడాలి. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణపట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత, వివక్షాపూరిత వైఖరి దురదృష్టకరం. ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణ ప్రజలు తమ అవసరాల, ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకొని, అభివృద్ధి పథంలో నడిచేందుకు సైతం కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేయాలనుకోవడం ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను అవమానించడమే.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణను అనేక విధాలుగా అణచివేతకు గురిచేస్తున్నది. ఇప్పటికే దాదాపు దశాబ్ద కాలంగా కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా, ఏ అంశంలోనూ సహకరించకున్నా అనేక రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ముందు వరుసలో నిలుపుతూ, గత పదేండ్ల తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ పక్షపాత నిర్ణయాలు, వివక్షపూరిత వైఖరి వల్ల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు చోటు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
తీగల అశోక్ కుమార్
7989114086