ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వాములైన తెలుగుదేశం, జెడి(యు) నుంచి నరేంద్ర మోడీ సర్కారుకి ఒత్తిడి తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రత్యేకహోదా తమకు కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రత్యేక హోదా వల్ల నిధులు కేంద్రం నుంచి అత్యధికంగా అందడమే కాకుండా పన్నుల వసూళ్లలో రాయితీ లభిస్తుందని చెబుతున్నాయి. అయితే ప్రత్యేక హోదా కల్పించడానికి కొన్ని నిబంధనల ప్రకారం ఇప్పుడిప్పుడే నిర్ణయించే అవకాశం కనిపించడం లేదు. కానీ ఆయా రాష్ట్రాలలో ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టులకు మాత్రం ఆర్థికంగా నిధులు కేటాయించవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. తెలుగుదేశం నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సాయంపైనే పూర్తిగా ఆధారపడింది.
కేంద్రం చేసే ఆర్థిక సాయంపై స్పష్టత వచ్చే వరకు రాష్ట్ర 202425 బడ్జెట్‌ను సెప్టెంబర్‌కు గానీ ప్రవేశపెట్టదలచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దాదాపు రూ. లక్ష కోట్ల వరకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇటీవల కోరినట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే కొన్ని సంవత్సరాల వరకు దాదాపు 12 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక సాయం అందించాలని ప్రధాని మోడీని కూడా అభ్యర్థించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఈ నెల 23న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధుల కేటాయింపులు ఉంటాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.గ్రీన్‌ఫీల్డ్ అమరావతి రాజధాని, పోలవరం ఈ రెండు ప్రాజెక్టులు రాష్ట్రప్రభుత్వ అజెండాలో టాప్‌లో ఉన్నాయి. ఇవికాక ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సూపర్ ఆరు సంక్షేమ పథకాలు రాష్ట్రప్రభుత్వ ఖజానాకు అత్యంత భారం కానున్నాయి.
గత ప్రభుత్వం కన్నా పెన్షన్లను పెంచినందున ఆ పెన్షన్ల చెల్లింపు ఏప్రిల్ నుంచి వర్తించేలా చెల్లించవలసివస్తోంది. 65 లక్షల పెన్షనర్లకు పెన్షన్ పెంపు వల్ల అదనంగా నెలవారీ రూ. 819 కోట్ల వరకు భారం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల భారం 2019లో రూ. 2, 64,338 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి రూ. 4,85,490 కోట్ల వరకు పెరిగిందని ఆర్‌బిఐ డేటా చెబుతోంది. ఇక బీహార్ జెడి(యు) ప్రభుత్వం కూడా బడ్జెట్‌కు ముందు కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపు భారీగా ఉండగలదన్న ఆశతో ఉంది. దాదాపు రూ. 30,000 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని నితీశ్ ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు సంకీర్ణ భాగస్వాముల నుంచి ఉమ్మడి డిమాండ్ల ఆర్థిక మొత్తం కేంద్రప్రభుత్వ వార్షిక ఆహార సబ్సిడీ బడ్జెట్ రూ. 2.2 లక్షల కోట్లలో సగం కన్నా అధికంగానే కనిపిస్తోంది.
ఇది ప్రధాని మోడీపై తలకు మించిన ఆర్థిక ఒత్తిడి తెస్తోంది. ఒకవైపు పభుత్వ రుణభారాన్ని నియంత్రించుకోవడంతో పాటు మరోవైపు తమ మిత్రపక్షాల డిమాండ్లను తులనాత్మకంగా నెరవేర్చవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై పడింది. ఆర్‌బిఐ రూ. 2 లక్షల కోట్లకు పైగా డివిడెండ్‌ను ప్రభుత్వానికి సమర్పించగా, సెంట్రల్ బ్యాంకుతోపాటు నాలుగు బ్యాంకులు దాదాపు రూ. 6,481 కోట్ల డివిడెండ్లను దీంతో పాటు రికార్డు స్థాయిలో పన్నుల ఆదాయం మొత్తాన్ని ప్రభుత్వానికి సమర్పించడం వల్ల ఈ ఏడాది ప్రభుత్వ ఖజానాకు లోటేమీ కనిపించడం లేదు. అందువల్ల బడ్జెట్‌లో భారీగా కేటాయింపులకు మోడీ ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉన్నట్టే. ఈ పరిస్థితిలో ఎంత మేరకు సంకీర్ణ భాగస్వాములకు మోడీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందో గమనించాలి. ఆంధ్ర, బీహార్ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఎక్కువగా రుణసౌకర్యం పొందడానికి వీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్థిక నిబంధనల ప్రకారం రాష్ట్రాలు జిడిపి 3 శాతం పరిమితికి మించి రుణాలు చేయకూడదు. కానీ బీహార్ ప్రభుత్వం ఆ పరిధికి మించి అదనంగా ఒకశాతం వరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 0.5% వరకు అదనంగా రుణ పరిధిని అనుమతించాలని అభ్యర్థిస్తున్నాయి. జెడి(యు) ప్రభుత్వం బీహార్‌లో తొమ్మిది విమానాశ్రయాలు, నాలుగు కొత్త మెట్రో లైన్‌ల నిర్మాణానికి, ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలకు చోటు కల్పించాలని ఆకాంక్షిస్తోంది. ఇవే కాక రూ.20,000 కోట్లతో థర్మల్ పవర్ ప్లాంట్, 20,000 కిమీ పొడవున రోడ్లకు మరమ్మతులు చేపట్టవలసిన అవసరం ఉందని చెబుతోంది. ఇవన్నీ కాకుండా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం ముందుకు తీసుకువస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా కల్పించాలని ఇప్పుడు కేంద్రంపై అంత ఒత్తిడి తీసుకురావడం లేదు. ప్రత్యేక హోదా కన్నా భారీగా నిధులు కేంద్రం నుంచి తెచ్చుకుంటేనే కానీ లక్షాలు నెరవేరవన్న ఆలోచనలో ఉంది.