మనతెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ఆర్ టిపి పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత ఇందిరా శోభన్ కాంగ్రెస్ సహా ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరే ఆలోచన లేదన్నారు. ఈక్రమంలో హుజురాబాద్‌లో ఉపాధి భరోసా యాత్రకు సిద్ధమైన ఇందిరాశోభన్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 27నుంచి ఫీల్ అసిస్టెంట్స్, నర్సులు, గెస్ట్ లెక్చరర్లకు మద్దతుగా ఉపాధి భరోసా యాత్ర చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.ప్రజా సమస్యలే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్దమవుతున్నానన్నారు. హరీష్ రావు భజాలపై తుపాకీ పెట్టి ఈటల రాజేందర్‌ను కాల్చాలని కెసిఆర్ నిర్ణయించారని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలు కెటిఆర్‌కు ఎందుకు ఇవ్వటం లేదో కెసిఆర్ చెప్పాలన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని, నిరుద్యోగుల తరుపున మాత్రమే పోరాటం చేస్తానన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కెసిఆర్, హరీష్‌రావులకే దక్కుతుందని ఈ సందర్భంగా ఇందిరా శోభన్ పేర్కొన్నారు.