Sunday, December 22, 2024

అసెంబ్లీ సీట్ల పెరుగుదల ఇప్పట్లో లేనట్లే!

- Advertisement -
- Advertisement -

No Increase in AP And TS assembly Seats Till 2026

2026 జనాభా లెక్కల ప్రచురణ వరకు ఆగాల్సిందే
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇందుకోసం 2026 వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేసింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్రం పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రక్రియ ప్రారంభం కావాలంటే కనీసం మరో నాలుగేళ్లు ఆగాల్సిందేననే స్పష్టమవుతోంది. అసెంబ్లీ స్థానాల పెంపుపై బుధవారం రాజ్యసభలో బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఎపిలో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలను 225, తెలంగాణలో 119 నుంచి 153 అసెంబ్లీ స్థానాలు పెంపు ఉంటుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ని సవరించే వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నది. గతేడాది కూడా లోక్ సభలో కేంద్రమే 2031 వరకు పెంపు లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2001లో చేపట్టిన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్‌సభ సీట్ల పునర్విభజనను ఫ్రీజ్ చేసి పెట్టారు. జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్ల విభజన చేపట్టాల్సి ఉంది. అప్పటివరకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల విభజన కూడా స్తంభించిపోతుందన్న అభిప్రాయాలున్నాయి. కానీ జనగణనతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచుకునే అవకాశం ఉంది. అందుకే గతంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేశాయి.

దీనిపై కేంద్రం అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంది. సీట్లు పెంచాలని అనుకుంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ అభిప్రాయం చెప్పడంతో తెలుగు రాష్ట్రాల ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లయింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకు పెంచలేదు. అసెంబ్లీ స్థానాలను పెంచాలని రెండు రాష్ట్రాలు పలుమార్లు కేంద్రాన్ని కోరాయి. అయితే ఈ అంశంపై కేంద్రం ఎప్పటికప్పుడు దాటవేత వైఖరినే అవలంభించింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో మరోసారి అసెంబ్లీ స్థానాలపై పెంపుపై చర్చ జరగడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో స్పష్టతనిచ్చింది.

రాజకీయ పార్టీల ఆశలకు గండికొట్టిన కేంద్రం

కేంద్ర నిర్ణయంతో రాజకీయ పార్టీల ఆశలకు గండికొట్టినట్లు అయింది. 2026 వరకు సీట్ల సంఖ్యను పెంచలేమని పార్లమెంట్ లో కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవానికి విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశం ఉందని… దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. విభజన చట్టం 2014లోని సెక్షన్ 26(1) రాజ్యంగంలోని ఆర్టికల్ 170 (3) లో ఉన్న నిబంధనలకు లోబడి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15కి పక్షపాతం లేకుండా శాసనసభ సీట్ల సంఖ్య కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెంచాలని సూచిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కి, ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలను 225కు పెంచాలని చట్టంలో పొందుపరిచాయని తెలుగు రాష్ట్రాల్లోని పలు రాజకీయ పార్టీలు ఈ సందర్భంగా సూచిస్తున్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను మోడీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పలువురు నేతలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలను పెంచిన కేంద్రం….తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాధ్యం కాదన్న కుంటి సాకులు చెప్పడం పట్ల మండిపడుతున్నారు. ముఖ్యంగా సీట్ల పెంపుపై కేంద్రం ఇచ్చిన సమాధానంపై రాష్ట్రంలోని అధికార టిఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీట్ల సంఖ్య పెంపుపై కేంద్రం కుంటిసాకులు చెబుతూ కాలాన్ని సాగదీస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News