Tuesday, November 26, 2024

బిసిలపై అందరిదీ వివక్షే!

- Advertisement -
- Advertisement -

ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ఒబిసిల మీద ప్రత్యేకంగా సానుభూతి కురిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఒబిసిలకు అన్యాయం జరుగుతున్నది అని పలు వేదికలపై మాట్లాడుతున్నది. పార్లమెంటు సాక్షిగా కులగణన చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నది. అంతేగాదు రిజర్వేషన్ సీలింగ్ 50 శాతంగా నిర్ణయించడాన్ని కూడా తప్పుపడుతున్నది. అట్లాగే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లలో బిసిలకు వాటా దక్కాలని అడుగుతున్నది. అంతెందుకు తాము గతంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక కుల గణన లెక్కలను బయట పెట్టాలని కూడా బిజెపి ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిండు. ఈ పైడిమాండ్లన్నీ కూడా తాము అధికారంలో ఉన్న సమయంలో అమలు జేయడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించిన అంశాలని గుర్తుంచుకోవాలి. అధికార అహం నెత్తికెక్కినప్పుడు బిసిలను రాజకీయ అస్పృశ్యులుగా చూసిండ్రు. ఇన్నేండ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక దళితుడు ముఖ్యమంత్రి కాగలిగిండు కాని 56 శాతమున్న బిసిల్లోంచి ఒక్కరికీ ఆ పదవి దక్కలేదని, అందుకు వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అనేది గుర్తించాలి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2011లో కులగణన చేపట్టాలని అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిండు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ని సైతం ఒప్పించిండు. ఈ మేరకు పార్లమెంటులో ఆయన ప్రకటన కూడా చేసిండు. 2011లోనే కులగణన చేయడానికి అన్ని అడ్డంకులు తొలగినాయి అని అనుకుంటున్న సమయంలోనే కాంగ్రెస్‌లోని బ్రాహ్మణాధిపత్యం దానికి అడ్డుకట్ట వేసిం ది. కేంద్ర ఆర్థిక శాఖామంత్రిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రిగా ఉన్నటువంటి పి.చిదంబరం ఇద్దరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమయింది.దాంట్లో అదనంగా కాలవ్‌‌సుని చేర్చడం కుదరదు కాబట్టి ఈ సారికి కులగణన కుదరదు అని బ్రాహ్మణాధిపత్యమూ, మనువాద భావజాలంతో ఈ పెద్దలిద్దరూ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. అయితే మన్మోహన్ సింగ్ సభలో హామీ ఇచ్చిండు కాబట్టి దాన్ని అమలు చేయడానికి కంటి తుడుపుగా ‘సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్’ సర్వేని 2011 లో చేపట్టిండ్రు. నిజానికి జనాభా లెక్కలను జవాబుదారీ తనమున్నటువంటి టీచర్లు,

ఇతర ప్రభుత్వోద్యోగులు చట్టానికి అనుగుణంగా చేపట్టారు. ఇందులో ఏవైనా తప్పులు జరిగినట్లయితే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి సెన్సస్ చట్టం వీలు కల్పిస్తుంది. అదే సామాజిక, ఆర్థిక కుల గణనను ఎక్కువగా అంగన్‌వాడీ టీచర్లతో, కొన్ని చోట్ల ఎన్‌జిఒల చేత, మరికొన్ని చోట్లలో ఉపాధి హామీ కూలీల చేత ఈ లెక్కలు సేకరించారు. సర్వే చేయించారు. ఇట్లా సేకరించిన లెక్కల్లో చాలా తప్పులు చోటు చేసుకున్నాయి అని ప్రభుత్వమే లోక్‌సభలో ప్రకటించింది. జనాభా లెక్కలతో పాటు గాకుండా తర్వాతి కాలంలో ‘సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్’ గణన ప్రత్యేకంగా చేశారు. ఇందు కోసం దాదాపు 4500ల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెచ్చించింది. ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే తయారయింది. ఎందుకంటే జనాభా సేకరణ (సెన్సస్) చట్టప్రకారం గాకుండా ఎలాంటి ఏకరూపత లేకుండా ఇష్టా రాజ్యాంగా సేకరించిన సమాచారాన్ని అధికారిక లెక్కలుగా గుర్తించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇట్లా సుప్రీంకోర్టు నిరాకరించిన డేటాను బయటపెట్టాలని ఇవ్వాళ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు.

తాము అధికారంలో ఉన్నప్పుడు అహంకారం నెత్తినెత్తుకొని బిసిలను రాజకీయ అస్పృశ్యులుగా చూసిండ్రు. వాళ్లు అనివార్యంగా బిజెపి వైపు మళ్లుతుంటే ఇప్పుడు పునరాలోచనలోపడ్డారు. ఇవ్వాళ బిజెపి చేస్తున్న మతపరమైన విభజనకు కౌంటర్‌గా ఒబిసిలలో కులచైతన్యాన్ని ప్రోది చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిసిల తరపున మాట్లాడుతున్నది. మొన్నటి కర్నాటక ఎన్నికల్లో డికె శివకుమార్ వర్గం ఎంతటి వత్తిడి తెచ్చినా ఒబిసి నాయకుడు సిద్ధ రామయ్యను ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోపెట్టింది. ఇదంతా ఎన్నికల ఎత్తుగడనే!
ఏరు దాటేదాక ఓడ మల్లయ్య ఏరు దాటినాక ఎగనామం పెట్టుడు కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదు. ఈ దేశ ఒబిసిల మొదటి శత్రువు కాంగ్రెస్. గతంలో కాకా కాలేల్కర్ కమిటీనీ, ఆ తర్వాత మండల్ కమిషన్‌ని రెండింటినీ ఆ పార్టీ వ్యతిరేకించింది. కులం ఆధారంగా గాకుండా ఆర్థిక స్థితి ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని 1990లో రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ‘మండల్ కమిషన్’ బిల్లు సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిండు.

అయ్యా మీరు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో (1990లో) కులం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇక్కడేమో ఆర్థిక స్థితి ఆధారంగా రిజర్వేషన్లు అడుగుతున్నారు? ఈ ద్వంద్వ నీతి ఎందుకు? అని విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రశ్నించిండు. దానికి రాజీవ్ గాంధీ అక్కడ అట్లా జరుగుతున్నట్లయితే అది కూడా తప్పేనని నిస్సిగ్గుగా మాట్లాడిండు. ఇట్లా 1950 నుంచి 2014లో తాము అధికారంలో వున్నప్పటి వరకూ (జనతా, బిజెపి పాలన మినహా) ఎన్నడూ బిసిలను కాంగ్రెస్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు బిసిల మీద వరాల జల్లు కురిపిస్తున్నది. ఇందులో ఎంత కుట్ర దాగి ఉన్నా? బిసి చైతన్యానికి ఈ డిమాండ్లు కచ్చితంగా ఉపయోగపడతాయి. అందులో భాగంగానే మొత్తం బిజెపి ప్రభుత్వంలోని 95 సెక్రటరీలలో కేవలం ముగ్గురు మాత్రమే ఒబిసిలున్నారు ఇది వివక్ష కాదా? అని ఒబిసి ప్రధాని మోడీని రాహుల్ గాంధీ నిలదీయడాన్ని ఈ చైతన్యంలో భాగంగానే గుర్తించాలి. బిసిల విషయంలో కాంగ్రెస్,

బిజెపి రెండూ వివక్షతో వ్యవహరించాయనేది గ్రహించాలి. 2018లో బిజెపి తరపున దేశ హోం మంత్రి హోదాలో రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ 2021 సెన్సస్‌లో కులగణన కూడా చేపడతామని ప్రకటించాడు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆయన స్థానంలో అమిత్ షా దేశ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన కులగణన చేసేది లేదు అని ప్రకటించాడు. అంతేగాదు కుల గణన చేసినట్లయితే దేశంలో జాతి వైషమ్యాలు పెచ్చరిల్లుతాయని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అందుకే ఈ గణన చేపట్టడం లేదు అని చెప్పారు. అదే సమయంలో కావాలంటే రాష్ట్రాలు ఈ కులగణన చేపట్టవచ్చని ప్రకటించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే రాష్ట్రాలు కులగణన చేపడితే పెచ్చరిల్లని జాతి వైషమ్యాలు, కేంద్రం చేపడితే పెచ్చరిల్లుతాయని చెప్పడమంటేనే ప్రభుత్వ వాదనలోని డొల్లతనాన్ని నిరూపిస్తున్నది.

తనకు తాను ఒబిసిగా ప్రకటించుకున్న నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆ వర్గాలకు అత్యధిక అన్యాయం జరుగుతున్నది. ఇడబ్లుఎస్ కింద ఎలాంటి లెక్కలు లేకుండానే ఆధిపత్య కులాల వారికి 10% రిజర్వేషన్లు కల్పించింది కూడా ఈ ప్రభుత్వమే అని గుర్తించాలి. అట్లాగే ఎప్పుడు అమలైతదో ఇప్పటికీ కచ్చితంగా తేలిన చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో సైతం బిసిలకు తీరని అన్యాయం జరిగింది. ‘కోటాలో వాటా’ పేరిట 33% మహిళల్లో ఒబిసిలకు 33% వాటా కావాలని ఒబిసి ఎంపిలు అడిగిండ్రు. అయినా కూడా బిజెపి ప్రభుత్వం ససేమిరా అన్నది. ఒబిసిల పట్ల వివక్షలో కాంగ్రెస్, బిజెపి రెండూ పోటీ పడుతున్నాయని చెప్పవచ్చు. వాళ్లకు ఒబిసిల ఓట్లు మాత్రమే అవసరం. వారి సంక్షేమం, అభివృద్ధి అవసరం లేదు. ఉదాహరణకు ఇవ్వాళ ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 75 జిల్లాలుంటే అందులో కేవలం 10 జిల్లాలకు మాత్రమే ఒబిసిలు కలెక్టర్లుగా ఉన్నారు. అందులో ఒక్కరు కూడా ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ సామాజిక వర్గం వారు లేరు. 21 జిల్లాలకు ఠాకూర్లు, 20 జిల్లాలకు బ్రాహ్మణులు కలెక్టర్లుగా ఉన్నారు.

అంటే 50 శాతంకి పైగా రెండు కులాల వాళ్ళే ఉన్నారు. దీన్ని బట్టి ఎవరి అధికారం ఉంటే వారికి ఆధిపత్యం ఉంటుందనేది కేవలం బిసియేతర కులాల్లో మాత్రమే సాధ్యం. యోగి ఆదిత్యనాథ్ తన కులానికి చెందిన వారిని 21 మందిని కలెక్టర్లుగా నియమించుకొని పాలన చేస్తున్నాడు. అదే మోడీ ఒబిసి అని పేరు చెప్పుకున్నప్పటికీ మొత్తం 95 మంది ఉన్నతస్థాయి సెక్రెటరీలలో ముగ్గురు మాత్రమే ఒబిసిలు మిగతా వారంతా బ్రాహ్మణులే అనేది గుర్తుంచుకోవాలి. అంటే నిర్ణయాత్మక స్థానాల్లో, కీలక పదవుల్లో ఎవరి అజమాయిషీ చలామణి అవుతున్నదో తెలుసుకోవచ్చు. ఈ విషయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం వెనుకబడి లేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే చట్టసభల్లో ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపచేసింది. ఇటీవల కేబినెట్‌లో సైతం దీనిపై మరోసారి తీర్మానం చేశారు. అంతేగాదు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నది. సంతోషం. కేంద్రానికి మార్గదర్శకంగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం తాము గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా చేపట్టిన డేటాను బహిర్గతం చేయాలి. ఎవరి సామాజిక ప్రాతినిధ్యం ఎంతున్నదో దీని ద్వారా తేలనున్నది. ఈ దిశలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శిగా వ్యవహరించాలని తెలంగాణ బహుజనులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News