ఇండోర్: అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయ వేడుకలకు ఎవరి నుంచి ఆహ్వానం అవసరం లేదని, భగవాన్ రాముడు తన హృదయంలో నివసిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. జనవరి 22న రామాలయ ప్రతిష్ఠకు ఆహ్వానం అందిందా అని విలేఖరులు అడగ్గా ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎంల) గురించి ప్రస్తావించారు.
ఇవిఎంల సమస్యపై మాట్లాడడానికి విపక్ష ఇండియా కూటమి నేతలకు ఎన్నికల కమిషన్ గత ఆరునెలలుగా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.ఇవిఎంల సాఫ్ట్‌వేర్, చిప్ టెక్నాలజీపై రానురాను ప్రజల్లో అపనమ్మకం పెరుగుతోందని ఆరోపించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటనను కోరిన విపక్షాల ఎంపీలనందరినీ సప్పెండ్ చేశారన్నారు. ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజాస్వామ్యంపై సామాన్య ప్రజలకు నమ్మకం పోతుందని , చివరకు ప్రజావిప్లవానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు.