ఏ కళాశాల విద్యార్థులకు ఆ కళాశాలలోనే పరీక్షలకు
చాలా కాలేజీల్లో ప్రయోగాలు చేయించని యాజమాన్యాలు
ప్రాక్టికల్స్ చేయకుండానే పరీక్షలకు హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ సారి కూడా జంబ్లింగ్ విధానం లేకుండా పాత పద్దతిలోనే జరుగనున్నాయి. ఏ కళాశాల విద్యార్థులు ఆ కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయకుండానే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విద్యాసంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యా, థర్డ్‌వేవ్ హెచ్చరికలతో జనవరి 8 నుంచి 31 వరకు ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటికీ హైకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ తరగతులు కొనసాగాయి. మొత్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు కేవలం మూడు నెలలు మాత్రమే ప్రత్యక్ష జరగతులు జరిగాయి. దాంతోపాటు దసరా సెలవులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించడం కారణంగా మూడు నెలలు కూడా పూర్తిస్థాయిలో తరగతులు జరగలేదు. కొన్ని కళాశాలలు మినహా చాలా కాలేజీల్లో ఇప్పటివరకు ఎక్కువగా థీయరీపైనే దృష్టి సారించి, ప్రాక్టికల్స్‌ను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్స్ చేయకుండా పరీక్షలు ఎలా హాజరు కావాలని విద్యార్థులకు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రాక్టికల్స్ మార్కులే కీలకం
ఇంటర్మీడియేట్ చదువుతున్న సైన్స్ విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో ప్రాక్టికల్స్ మార్కులే కీలకం. ఎంపిసి విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల్లో ప్రయోగ పరీక్షలు జరుగుతాయి. బైపిసి విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు జువాలజీ, బోటనీ సబ్జెక్ట్‌ల్లో ప్రాక్టీకల్ పరీక్షలు జరుగుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క మార్కు తేడాతో కూడా కొన్ని అవకాశాలు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఇంటర్ సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణులు కాలేని వారికి సైతం ప్రయోగ పరీక్షల్లో సెంట్ పర్సెంట్ మార్కులు వేస్తూన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు కళాశాలల్లో చేరే సమయంలోనే నిర్వాహకులతో మాట్లాడుకోవడం వంటి వాటితో ఎలాంటి ప్రతిభ లేకపోయినా, కళాశాలల్లో పరికరాలు లేకపోయినా ఎలాంటి రికార్డులు రాయకపోయినా వారికి మొత్తం మార్కులను కళాశాలల నిర్వాహకులు వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.