రద్దీగా ఉండే బస్సులు, విమానాలు, ఆస్పత్రుల్లో మాత్రం తప్పనిసరి
సిడిసి ప్రకటన
మీడియా సమావేశానికి మాస్కులు లేకుండా హాజరైన బైడెన్, కమలా హ్యారిస్
వాషింగ్టన్: మొన్నటి దాకా కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్న కొద్దీ ఆంక్షలను సడలిస్తున్నారు. తాజాగా అమెరికాలో కార్యాలయాలు వంటి ఇన్‌డోర్ ప్రదేశాల్లో, బాహ్యప్రదేశాల్లో మాస్కులు తొలగించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సెంగర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకటన చేసింది. కాకపోతే రద్దీగా ఉండే బస్సులు, విమానాలు, ఆస్పత్రులు వంటి వాటిలో మాత్రం మాస్కులు ధరించాల్సిందే. గురువారం ఈ ప్రకటన వెలువడిన తర్వాత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన మీడియా సమావేశానికి మాస్కులు ధరించకుండా హాజరయ్యారు. ‘ ఇది నిజంగా గొప్ప విజయం. ఓ గొప్ప రోజు. అత్యంత వేగంగా అమెరికా పౌరులకు వ్యాక్సిన్ అందించడం వల్లనే ఇది సాధ్యమైంది’ అని బైడెన్ అన్నారు.
సిడిసి తాజా మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ, పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకే ప్రమాదం చాలా చాలా తక్కువగా ఉంటుంది అని బైడెన్ అన్నారు. ‘ మేము బయటికి పోయి ఎవరినీ అరెస్టు చేయం. కాకపోతే వ్యాక్సిన్ తీసుకోని వారు మాస్కులు ధరించాలని చెబుతాం’ అని ఈ సందర్భంగా బైడెన్ అన్నారు. కేవలం 114 రోజుల్లో 25 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.‘దీని ఫలితాలను మనం చూస్తున్నాం. మొత్తం 50 రాష్ట్రాల్లో 49 రాష్ట్రాల్లో కేసులు తగ్గాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఆస్పత్రుల్లో చేరే వారు తగ్గుతున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. మరణాలు సైతం ఏడాది క్రితంతో పోలిస్తే 80 శాతం తగ్గాయి’ అని బైడెన్ చెప్పారు. తాజా నిర్ణయంతో అమెరికా క్రమంగా కరోనా ముందు నాటి పరిస్థితులకు చేరుకుంటోంది. తాజాగా 12-15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ తయారు చేసిన టీకా అనుమతులు పొందడంతో అమెరికా ఫెడరేషన్ ఆఫ్‌టీచర్స్ లేబర్ యూనియన్ పాఠశాలలను మరోసారి తెరవాలని కోరుతోంది.