హైదరాబాద్: కులగణనలో ఏ తప్పుల లేవని, ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిసిలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, సబ్‌ప్లాన్, పథకాల రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో పొన్నం మీడియాతో మాట్లాడారు. కులగణన భారత దేశం మొత్తం చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలనే డిమాండ్ ఉందని, ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని పొన్నం కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నేతలు సర్వేలో పాల్గొనలేదని, ఆవహేళన మాత్రం చేశారని ధ్వజమెత్తారు. సర్వేలో పాల్గొన్న వాళ్లకే మాత్రమే కులగణనపై మాట్లాడే అవకాశం ఉంటుందని చురకలంటించారు. బిఆర్‌ఎస్ నేతలు వెనుకబడిన వర్గాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన చేయడంలేదని మోడీ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందని, బిజెపి పార్టీ ప్యూడలిస్టిక్ పార్టీ అని పొన్నం ధ్వజమెత్తారు.