ముంబై: దేశంలో మోడీ ప్రభంజనం లేదంటూ మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి, అలనాటి సినీ నటి నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె నిజమే చెబుతోందని, క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను ఆమె మాటలు ప్రతిబింబిస్తున్నాయని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) వ్యాఖ్యానించింది. అమరావతి నియోజకవర్గంలో సోమవారం ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ నవనీత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికలను గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే మనం పోరాడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల లోపలే ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకువెళ్లి మనకే ఓటు వేయమని చెప్పాలి. మోడీ గాలి వీస్తోందన్న భ్రమల్లో బతకకండి. గత ఎన్నికలలో వాళ్ల దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. అయినా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేనే గెలిచాను అని నవనీత్ చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నవనీత్ గెలిచారు. ఆ ఎన్నికలలో అవిభక్త ఎన్‌సిపి ఆమెను బలపరిచింది. నవనీత్ రాణా వీడియో వైరల్ కావడంతో ఎన్‌సిపి(శరద్ పవార్), శివసేన(యుబిటి) స్పందిస్తూ నవనీత్ వ్యాఖ్యలలో బిజెపి శ్రేణులలో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పాయి. మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలను ప్రతిపక్ష కూటమి గెలుచుకుంటుందని శివసేన(యుబిటి)కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.
మోడీ ప్రభంజనాన్ని పక్కన పెట్టండి. మోడీ తన సీటును గెలుచుకోవడం కూడా అనుమానమే. దేశవ్యాప్తంగా బిజెపికి 45 సీట్లు వస్తాయని ఉద్ధవ్ థాకరే ఇదివరకే చెప్పారు. బిజెపి సొంత అభ్యర్థులే నిజాలు చెబుతున్నారు. అది కూడా బహిరంగంగా..స్పష్టంగా అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా..ఎన్‌సిపి(శరద్ పవార్) అధికార ప్రతినిధి మహేష్ తాపసే స్పందిస్తూ నవనీత్ రాణా నిజాలు మాట్లాడుతున్నారని, ఈ కారణంగానే బిజెపి ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటోందని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నవనీత్‌కు, ఇతర బిజెపి అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని, మోడీ గాలి వీయడం లేదన్న వాష్తవం బిజెపికి కూడా తెలుసునని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకులను ఒకరి వెంట ఒకరిని బిజెపి చేర్చుకోవడంతోనే ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతోందని, అవినీతిపరులని నిందించిన ప్రతిపక్ష నాయకులను సైతం బిజెపి చేర్చుకుంటోందని ఆయన చెప్పారు.
గెలిచే అవకాశం ఉన్న ప్రతిపక్ష అభ్యర్థులకు సైతం బిజెపి గాలం వేస్తోందని ఆయన ఆరోపించారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నవనీత్ రాణా వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. తప్పుడు భాష్యాన్ని సృష్టించేందుకు తన మాటలను ఎడిట్ చేసి ప్రతిపక్షం వైరల్ చేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పనుల గురించి ప్రజలకు తెలుసునని, మోడీ ప్రభంజనం గతంలో ఉంది..ఇప్పుడూ ఉంది..రేపూ ఉంటుంది అంటూ ఆమె ప్రకటించారు. మోడీ ఇచ్చిన హామీలను ప్రజల వద్దకు తీసుకు వెళుతూ ఓట్లు అడుగుతున్నామని ఆమె చెప్పారు. ఈసారి 400 సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.