కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్:బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం తమకు లేదని కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి నేరం చేయనప్పుడు ఆమెకు భయమెందుకని ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత పూర్తిగా సహకరించాలని సూచించారు. శుక్రవారం 12 మంది ఈడీ అధికారులు కవిత నివాసానికి వెళ్లి నాలుగు గంటలు పాటు విచారించి తరువాత అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ ఇన్నాళ్లూ ఈడీ విచారణకు సహకరించకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ఆమె సహకరించనందునే ఈడీ నేరుగా ఇంటికి వెళ్లిందన్నారు. ఈడీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని గుర్తు చేశారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకొని పోతాయన్నారు. అదే విధంగా మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో విచారణలు మొదటిసారిగా జరగలేదని, ఈడీ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి విచారణలు జరుపుతారని పేర్కొన్నారు. కవిత ఆరెస్టుపై ఆపార్టీ నాయకులు బిజెపిపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.