వైద్య నిపుణుల సూచన
న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ బీఏ 2 కేసులు పెరుగుతుండడంతో మరోసారి దేశ వ్యాప్తంగా కొవిడ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలపై ఉన్నత వైద్య నిపుణులు స్పందించారు. దీనిపై ఎలాంటి ఆందోళనలు వద్దని ఐఎంఏ కొవిడ్ టాస్క్ ఫోర్స్ నేషనల్ కో ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవ్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ సబ్‌లీజియేజ్ వేరియంట్ బీఏ 2 అని చెప్పారు. ఇప్పటికే బీఏ 1 సబ్ వేరియంట్ బారిన పడిన వారిపై కూడా బీఏ 2 ప్రభావం ఉండదని తెలిపారు. ఇదేమీ( బీఏ 2 ) కొత్త వేరియంట్ కానీ స్ట్రెయిన్ కానీ కాదని, ఒమిక్రాన్ సబ్‌లీనియేజ్ మాత్రమేనని డాక్టర్ జయదేవ్ స్పష్టం చేశారు. బీఏ1 కంటే కొంచెం ఎక్కువగా బీఏ2 వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. గత రెండేళ్లుగా ఇది నిలకడగా బలం పుంజుకుంటోందని, అందువల్ల మరికొందరికి ఇన్‌ఫెక్ట్ కావచ్చని పేర్కొన్నారు.
బీఏ1,బీఏ2 ఈ రెండూ ఇమ్యూన్ ఎస్కేప్ ఎబిలిటీ కలిగి ఉంటాయని , సహజం గానే ఇన్‌ఫెక్ట్ అయిన వారికి, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్‌ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దక్షిణాఫ్రికాలో గత నవంబర్‌లో గుర్తించిన ఒమిక్రాన్ సబ్‌లీనియేజ్ గానే బీఏ2 ను చెప్పవచ్చని డాక్టర్ జయదేవ్ వివరించారు. తదుపరి వేరియంట్ వచ్చినప్పుడు కేసుల పెరుగుదల ఉండొచ్చని , అయితే అదెప్పుడు వస్తుందనేది చెప్పలేమని పేర్కొన్నారు. చరిత్ర బట్టి చూస్తే 6 నుంచి 8 నెలలు పట్టవచ్చని అన్నారు. అప్పటివరకూ ఒమిక్రాన్ “ లోఫేజ్ ” ఉంటుందని చెప్పారు. అయితే వైరస్ వ్యాప్తి కాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ ట్రెండ్‌ను చూసినప్పుడు బీఏ2 భారత్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర ఆసియా దేశాలు, యూరప్ వ్యాప్తంగా కూడా క్రమంగా విస్తరించవచ్చు. డెన్మార్క్, అమెరికా, బ్రిటన్ దేశాల్లో బీఏ2 కేసులు స్వల్పంగా పెరగవచ్చు. ప్రపంచం లోని 57 దేశాల్లో ఒమిక్రాన్ బీఏ 2 సబ్ వేరియంట్‌ను కనుగొన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ఒమిక్రాన్ కంట బీఏ2 సబ్ వేరియంట్ మరింత అంటువ్యాధి అని అధ్యయనంలో వెల్లడైందని వివరించింది.