Monday, December 23, 2024

‘వారసత్వం ఎంట్రీ పాస్ మాత్రమే’.. ప్రతిభతోనే రాణింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే అని, తర్వాత మన సమర్థతే మనల్ని ప్రజల్లో నిలబెడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కె.టి.రామారావు అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో నాలుగు సార్లు తాను ఎన్నిక అయితే ప్రతీసారీ పెరిగిన మెజారిటీయే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరని అన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని పేర్కొన్నారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టం గెలిచానని.. పనితీరుతోనే సిరిసిల్లలో తన మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానని చెప్పారు. సరిగ్గా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు తనను కూడా పక్కన పెట్టేవారని తెలిపారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆద్వర్యంలో శనివారం ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. తనకు రోజుకి 13 వార్తా పత్రికలు చదవటం అలవాటు అని పేర్కొన్నారు. ఒక్కో వార్త ఒక్కో రకంగా వస్తుంది, వాటిలో ఏధి వాస్తవమో తెలుసుకోడానికి ఎక్కువ పత్రికలు చదవాల్సి వస్తుందని చెప్పారు. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు.

మీడియా మోడియాగా మారింది

దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నా, ద్రవ్యోల్బణం అతలాకుతలం చేస్తున్నా, దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నా వార్తలు రావు అని పేర్కొన్నారు. హలాల్ గురించి, హిజాబ్ గురించి మాట్లాడుతారు… శాసిస్తారని చెప్పారు. ఏం తినాలి, ఏం వేసుకోవాలి అనేవి చెప్పే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడిదని, ఇలాంటివి మీడియా నిలదీయదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జుమ్లా మాటలు, లేకపోతే హమ్లా అని కేంద్రాన్ని విమర్శించారు. ఐటీ దాడుల భయం, దేశంలో మీడియా మోడియాగా మారిపోయిందని కెటిఆర్ పేర్కొన్నారు. పక్క దేశంలో అదానికి ఓ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేసీ మరి మోడీ ఇప్పంచారని సాక్షాత్తు ఆ దేశ మంత్రి పేర్కొన్నా అలాంటి వార్తలపైన మన దేశ మీడియా పరిశోధన చేసి ఏది వాస్తవమో వార్తలు రాయదని అన్నారు.

మీడియా సంస్థల కంటే కూడా మీడియాలో పని చేసే వారి ధైర్యం గొప్పదని వ్యాఖ్యానించారు. నిజాం కాలంలో షోయబుల్లాఖన్ గోల్కొండ పత్రిక ద్వారా నిజాంను ప్రశ్నించారని అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి లాంటి కలం వీరుల నైతిక బలం గొప్పదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, టిఆర్‌ఎస్ పార్టీ పెట్టిన సమయంలో తమకు డబ్బు సపోర్ట్, మీడియా సపోర్ట్ లేదని, కానీ మన తెలంగాణ ప్రాంత పాత్రికేయులు తాము ఉన్నామని ఉద్యమానికి మద్దతుగా దైర్యం ఇచ్చారని చెప్పారు. అప్పుడు కేంద్రంలో ఎన్‌డిఎ, రాష్ట్రంలో టిడిపి పార్టీలు ఉన్నాయని, మీడియా యాజమాన్యాలు మనవి కాదని, అయినా మీడియాలో ఉన్న తెలంగాణ జర్నలిస్టు తమకు అండగా నిలబడ్డారని అన్నారు. అప్పుడు తమకు నీడగా నిలిచిన చాలా మంది జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి ప్రభుత్వ పరంగా గౌరవించుకున్నామని తెలిపారు.

టిఆర్‌ఎస్‌కు అండగా నిలిచింది జర్నలిస్టులే..

పత్రికా యాజమాన్యం కంటే తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తి ఎక్కువని చెప్పారు. స్టింగర్ల నుంచి డెస్క్ వరకు తమకు సపోర్టుగా నిలబడటంతోనే తెలంగాణ సాధించగలిగామన్నారు. తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీదాక వచ్చి తెలంగాణ కోసం కొట్లాడారని గుర్తుచేశారు. సిఎం కెసిఆర్ ఏనాడూ జర్నలిస్టుల ప్రాధాన్యతను తగ్గించలేదని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 19 వేల అక్రిడేషన్ కార్డులున్న జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్నారని తెలిపారు.

మున్సిపల్ శాఖ థాంక్ లెస్ జాబ్ అని మంత్రి వ్యాఖ్యానించారు. 22 వేల మంది పారిశుధ్య సిబ్బంది రెక్కలు ముక్కలు చేసుకున్నా చిన్న అభినందన వార్త రాదని అన్నారు. రెండు కాలనీల్లోకి నీళ్లు రాగానే హైదరాబాద్ నీట మునిగిందని రాస్తారని విమర్శించారు. అతిశయోక్తి అలంకారం గురించి తనకు తెలుసని, దాన్ని ఎంతలా వాడుకోవాలో అంతే వాడాలని సూచించారు. జర్నలిజం ముసుగులో ఇప్పటికీ వ్యక్తిగత దూషణలు, బూతులు తిడుతున్నారని చెప్పారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఆయన గురించి రాసిన పత్రికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు.

ప్రధాని మన్ కీ బాత్ తప్ప మీడియాతో మాట్లాడలేదు

ప్రధాని నరేంద్ర ఎనిమిదేళ్లుగా మోడీ మన్ కి బాత్ తప్ప మీడియాతో మాట్లాడిన సందర్భం లేదని కెటిఆర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హెలికాప్టర్ క్యాబిన్ తెలంగాణలో తయారవుతుంది, ఐటీలో మంచి కంపెనీలు హైద్రాబాద్‌లో ఉన్నాయని, కానీ ఎవరు ఈ వార్త మనకు అనుకూలంగా రాయరని చెప్పారు. మంచి చేసినప్పుడు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. పాల, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ముందు స్థానంలో ఉంది, ఇవన్నీ వార్తలు కావా…? అని అడిగారు. చాలా రంగాల్లో ముందు వరుసలో ఉన్నా మన గురించి మంచిని మంచిగా రాయరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమంలో చెరువులను అభివృద్ధి చేసిందని, దీంతో చెరువులు నిండి వ్యవసాయానికి రైతులకు ఉపయోగకారిగా నిలుస్తున్నాయని అన్నారు. కట్టలు తెగిపోకుండా గట్టిగ ఉండేలా చేశామని, ఇది వార్తగా రాయరు కానీ కట్ట తెగితే మాత్రం వార్తలు రాస్తారని పేర్కొన్నారు.

ఇవేవీ వార్తలు కాదా..?

9 బిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్లను హైదరాబాద్ ఉత్పత్తి చేసిందని, కరోనా వ్యాక్సిన్ల గురించి మన మీడియా ఎందుకు హైలెట్ చేయలేదని వాపోయారు. జో బైడెన్ ప్రయాణించే హెలికాప్టర్ క్యాబిన్ కూడా హైదరాబాద్‌లోనే తయారయిందన్నారు. భారత ప్రధాని చేసిన ఒత్తిడి వల్ల అదానీకి రూ.6 వేల కోట్ల ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక చెప్పిందని పేర్కొన్నారు. అదానీకి ఇచ్చిన ప్రాజెక్టుపై ఏ ఒక్క మీడియా అయినా అక్కడికి వెళ్లి నిజానిజాలు నిగ్గుతేల్చిందా అని ప్రశ్నించారు. పాలు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో రికార్డులు సృష్టించామని, ఐదు రకాల విప్లవాలతో తెలంగాణ గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైందని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్నదని, పల్లె ప్రగతి, పట్టణప్రగతి, అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ వార్తలు కాదా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 7 శాతానికి పైగా గ్రీన్ కవరేజ్ పెరిగిందని.. దీనికి పతాక శీర్షిక ఉండదా..?. ఏ మీడియాలో అయినా పాజిటివ్ కంటే నెగెటివే ఎక్కువ వ్యాప్తి చెందుతున్నదని చెప్పారు.

సోషల్ మీడియానా లేదా యాంటీ సోషల్ మీడియానా అర్థం కావడంలేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనన్ని జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమాలు ఒక్క తెలంగాణలో మాత్రమే అమలు అవుతున్నాయని అన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డ పాత్రికేయులను ఆదుకున్నామని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.సీతారామ రావు మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయంలో అభ్యసించే పాత్రికేయులు వందల సంఖ్యలో ఉండడం గర్వకారణంగా పేర్కొన్నారు.

గౌరవ అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, దేశంలో మీడియా పాత్ర, మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరును వివరించారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని, అధ్యాపకుల పదవీవిరమణ వయస్సును ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధంగా పెంచాలని మంత్రి దృష్టికి తెచ్చారు.ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ జర్నలిస్టు ఎస్.వెంకట్ నారాయణ, వర్సిటీ రిజిస్ట్రార్ ఎ.వి.ఎన్.రెడ్డి, టి-శాట్ సి.ఇ.ఒ ఆర్. శైలేష్ రెడ్డి,సామాజిక శాస్త్రాల డీన్ వడ్దానం శ్రీనివాస్ ప్రసంగించారు. అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యాపక సిబ్బంది, పరిశోధక విద్యార్ధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News