Thursday, December 19, 2024

కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరు

- Advertisement -
- Advertisement -

గద్వాల రూరల్: పేద బడుగు, బలహీన వర్గాల ప్రజందరికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం గద్వాల మండలం అనంతపురం, బస్రాచెర్వు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతూ నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఏక కాలంలో పంట రుణాలను మాఫీ చేశారని గుర్తు చేశారు.

రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని, సీఎం కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించామని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు మీద ఆదారపడిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పూర్తి చేయడం వల్లే ప్రతి ఎకరాకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పోరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించామని, ఇందిరమ్మ పథకం ద్వారా గూడులేని పేదలకు ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ఒకసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీలో బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుంది: జడ్పీ చైర్‌పర్సన్
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించబోతుందంటూ జడ్పీ చైర్‌పర్సన్ సరిత కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని ఇందిరమ్మ రాజ్యం వస్తుందని భరోసా కల్పించారు. అధికార పార్టీ నాయకులు ప్రలోభపెట్టిన, బెదిరింపులకు గురి చేసినా అదరకుండా, బెదరకుండా ముందుకు సాగాలని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపురంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాయకులను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్, బల్గెర నారాయణరెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, వీరుబాబు, తిరుపతయ్య, రఘునాయుడు, దినేష్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, నందు, గట్టు కృష్ణ, వెంకటస్వామి గౌడ్, గట్టు గౌస్, అమరవాయి కృష్ణారెడ్డి, కృష్ణమూర్తి, జమాల్, కొత్తగణేష్, ఇమానియేల్,రంజిత్, వీరేష్, రవి, జాంగీర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News