Saturday, November 23, 2024

డబ్బుల్లేని బ్యాంకుల ముందు ప్రజల ఆర్తనాదాలు

- Advertisement -
- Advertisement -

No one has money Under Taliban rule

ఆరు నెలల వేతనాలకై ఉద్యోగుల ఆందోళనలు
ఎటిఎంల ముందు క్యూ కట్టిన జనాలు
అఫ్ఘన్‌లో దుర్భర పరిస్థితులు
గడువుకన్నా ముందే తమ వారిని తరలించిన పలు దేశాలు

కాబూల్: తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్ఘనిస్థాన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజల జీవనం రోజురోజుకూ మరింత దుర్భరంగా మారుతోంది. తాలిబన్లు ఎప్పుడు ఏం చేస్తారో .. ఏ వైపునుంచి ఉగ్రమూక ఆత్మాహుతి దాడులకు తెగబడుతుందో అక్కడి జనం నిత్యం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ రాక్షస మూకల పాలనలో మగ్గిపోవడం ఇష్టంలేక అక్కడి జనం ఇన్నాళ్లూ బతికిన అఫ్ఘన్‌ను వీడి పారిపోయేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. చాలా పాశ్చాత్య దేశాలు అఫ్ఘన్‌నుంచి తమ పౌరుల తరలింపు కార్యక్రమాన్ని ఆగస్టు 31గడువుకన్నా ముందే పూర్తి చేయడంతో విమానాశ్రయంనుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లయింది. అంతేకాక రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల తర్వాత తాలిబన్లు విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కరువు కోరల్లో చిక్కుకుని ఉన్న అఫ్ఘన్‌లో తాజా పరిస్థితుల కారణంగాఆ దేశానికి మరింత మానవతా సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి ఏజన్సీ చ్చరించింది.

ఓ వైపు వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి చేరుకుని తరలింపు కోసం ఎదురు చూపులు చూస్తుండడం, మరో వైపు దాదాపు ఆరు నెలలుగా అందని తమ జీతాల కోసం వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకుల ఎదుట ఆందోళన చేస్తున్న దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించి వేస్తున్నాయి. తమ జీతాల కోసం ఉద్యోగులు బ్యాంకుల ముందు ఆందోళన చేస్తుండడంజజ సామాన్యులు ఎటిఎం మిషన్ల వద్ద డబ్బులు విత్‌డ్రా చేయడం కోసం పడిగాపులు కాస్తున్న దృశ్యాలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

న్యూ కాబూల్ బ్యాంక్ వద్ద వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గత మూడు నెలలనుంచి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం బ్యాంకులు పునః ప్రారంభమైనప్పటికీ ఎవరూ డబ్బులు విత్‌డ్రా చేయలేకపోతున్నారని వారు వాపోతున్నారు. అయితే బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవని బ్యాంకు సిబ్బంది అంటున్నారు. ఎటిఎం మిషన్లు పని చేస్తున్నప్పటికీ నగదు విత్‌డ్రాపై పరిమితులు విధించడంతో తిప్పలు తప్పడం లేదు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు ఎటిఎంల వద్దకు చేరుకుని గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.

గడువుకు ముందే తరలింపు పూర్తి

మరోవైపు అఫ్ఘన్‌లో కల్లోల పరిస్థితుల దృష్టా చాలా దేశాలు అక్కడినుంచి తమ ప్రజల తరలింపు ప్రక్రియను గడువుకు ముందే పూర్తి చేశాయి. ఆగస్టు 31 లోగా అమెరికన్లను స్వదేశానికి తీసుకెళ్లి పోవాలని తాలిబన్లు అగ్రరాజ్యానికి డెడ్‌లైన్ పెట్టారు. దీంతో అమెరికాకంటే రెండు రోజుల ముందే మిగతా దేశాల తమ వాళ్ల తరలింపు పూర్తి చేయాలని నిర్ణయించాయి. తమను తీసుకెళ్లాలని అఫ్ఘన్ వాసులనుంచివెల్లవెత్తుతున్న దరఖాస్తుల స్వీకరణను నిలిపి వేశాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, పోలండ్, బెల్జియం, జపాన్ దేశాలు ఇప్పటికే తరలింపు పూర్తి చేసినట్లు ప్రకటించాయి.

మరో వైపు కాబూల్‌లో పేలుళ్లు జరిగినప్పటికీ తమ వాళ్లను స్వదేశం తీసుకెళ్లే ప్రక్రియను ఆపబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఈ నెల 14నుంచి తాము 1.1 లక్షల మందిని తరలించినట్లు పెంటగాన్ ప్రకటించింది. మరోవైపు అఫ్ఘన్‌నుంచి బ్రిటన్‌కు వెళ్లేందుకు అర్హత, అనుమతి ఉన్న అందరినీ తరలించించినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కాబూల్‌నుంచి తమ వాయుసేన విమానాలద్వారా 15 వేల మందిని తీసుకెళ్లామని చెప్పారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే తరలించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కాబూల్‌నుంచి 500 మంది జర్మన్లు, 4 వేల మంది అఫ్ఘన్లు సహా మొత్తం 5,437 మందిని తరలించినట్లు జర్మనీ ప్రకటించింది. కాబూల్‌నుంచి శుక్రవారం రాత్రితో తమ వాళ్ల తరలింపు పూర్తయినట్లు ఫ్రాన్స్ వెల్లడించింది. కాబూల్‌నుంచి తమ ప్రజలను పాకిస్థాన్‌కు తరలించే ప్రక్రియ పూర్తయినట్లు బెల్జియం ప్రకటించింది. అఫ్ఘన్‌లో మిగిలిపోయిన తమ పౌరులు, సిబ్బందిని శుక్రవారం 4 మిలిటరీ విమానాలో సురక్షితంగా తీసుకువచ్చినట్లు జపాన్ తెలిపింది.

1.40 కోట్ల మందికి అత్యవసర సాయం అవసరం: యుఎన్

ఇదిలా ఉండగా అఫ్ఘన్‌లో తీవ్రమైన కరువు కారణంగా 70 లక్షల మందికి పైగా ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడినట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస ్థ(ఎఫ్‌ఎఓ) హెచ్చరించింది. కరువుతో పాటుగా కరోనా వైరస్, ఇటీవలి హింస కారణంగా పెద్ద సంఖ్యలో జనం నిరాశ్రయులుగా మారడంలాంటి సమస్యలు కూడా పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నాయని పేర్కొంది. ప్రతి ముగ్గురు అఫ్ఘన్లలో ఒకరికి ( అంటే దాదాపు కోటీ 40 లక్షల మందికి) అత్యవసరంగా సాయం అవసరమని యుఎన్ ఆహార కార్యక్రమం ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. అఫ్ఘన్ దాదాపు 70 శాతం విదేశాలనుంచి అందే సాయంపైనే అధారపడి ఉంది. అయితే తాలిబన్‌లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ఈ సాయం దాదాపు పూర్తిగా నిలిచిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News