Wednesday, January 22, 2025

నేనే వస్తా… ఎవరూ రాకండి

- Advertisement -
- Advertisement -

నేను త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా
బిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులకు మాజీ సిఎం కెసిఆర్ విజ్ఞప్తి
ఆసుపత్రి బెడ్ నుంచి వీడియో సందేశం విడుదల చేసిన కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తనను పరామర్శించేందుకు ఎవరూ యశోద ఆసుపత్రికి రావద్దని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాజీ సిఎం కెసిఆర్ మంగళవారం ఆసుపత్రి బెడ్ నుంచి వీడియో సందేశం విడుదల చేశారు. ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు తనను బయటకు పంపడం లేదని పేర్కొన్నారు. తనతో పాటు వందలాది మంది పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదని అన్నారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలోనే సాధారణ స్థితికి చేరుకొని మీ ముందుకు వస్తానని బిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి అన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాది, వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ కెసిఆర్ హృదయపూర్వక వందనాలు తెలిపారు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌తో తాను యశోద హాస్పిటల్లో చేరానని తెలిపారు. ఆసుపత్రికి సందర్శకులు పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయని, దాంతో నెలల తరబడి బయటకు పోలేరని వైద్యులు చెబుతున్నారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అందరూ బాధపడకుండా మీ స్వస్థలాలకు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి వెళ్లాలని కోరారు. మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి దండం పెడుతున్నానని అభిమానులను ఉద్దేశించి కెసిఆర్ పేర్కొన్నారు. ఇంకో పది రోజుల వరకు ఎవరూ కూడా ఆసుపత్రికి తరలిరావొద్దని ఈ సందర్భంగా కెసిఆర్ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్‌లో మనం కాకుండా వందలాది మంది కూడా ఉంటారని, వాళ్ల క్షేమం కూడా మనకు ముఖ్యమని పేర్కొన్నారు. “కాబట్టి ఎవరూ అన్యదగా భావించకుండా, క్రమశిక్షణతో మీ ఇళ్లకు చేరండి… మంచిగ అయిన తర్వాత నేను ప్రజల మధ్యన ఉండేవాన్నే కాబట్టి, మనం కలుసుకుందాం… దానికి ఇబ్బంది లేదు” అని కెసిఆర్ అన్నారు. దయచేసి తన కోరికను మన్నించి, తన మాటను గౌరవించి సహకరించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.
కెసిఆర్‌కు ప్రముఖల పరామర్శలు
తుంటి ఎముక గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పరామర్శలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ మరోసారి కెటిఆర్‌కు ఫోన్ చేసి కెసిఆర్ యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.
కెసిఆర్‌ను పరామర్శించిన మంత్రులు, ఎంఎల్‌ఎలు
రాష్ట్ర మంత్రులు దామోదరం రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంఐఎం ఎంఎల్‌ఎ, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఎల్‌ఎ లాస్య నందిత బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మాజీ సిఎం కెసిఆర్ దగ్గర కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీవన్‌రెడ్డి, బాల్కసుమన్, కెఎ పాల్, పలువురు జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కెసిఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.

కెసిఆర్‌కు కంకణం కట్టిన వేద పండితులు

బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన కుంకుమ తిలకాన్ని దిద్ది, కెసిఆర్‌కు వేద పండితులు ముంజేతి కంకణాన్ని కట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News