కాంగ్రెస్ అంటే బిజెపి నేతలకు భయం పట్టుకుంది
ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేస్తున్నాం
అదానీ, అంబానీ ఇళ్లలో ఈడీ, ఐటీ సిబ్బందితో తనిఖీలు చేయించండి..?
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అంటే బిజెపి నేతలకు భయం పట్టుకుందని అందుకే తమపై పదేపదే ఆరోపణలు చేస్తున్నారని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదంటూనే బిజెపి పదేపదే విమర్శిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు టెంపోల్లో డబ్బులు తీసుకెళ్తున్నారని ప్రధాని స్థాయి వ్యక్తి అనడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తామని, అందుకే ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉంది
రేవంత్ సర్కార్‌ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదని ఖర్గే అన్నారు. నెల రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందని బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మల్లికార్జు ఖర్గే రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందని, ఐదేళ్ల పాటు తమ పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిరాశలో ఉన్నవారే ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు అమలు చేశామన్నారు. మరో గ్యారంటీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందన్నారు. త్వరలోనే మరో గ్యారంటీని కూడా అమలు చేస్తామన్నారు. బిజెపి హయాంలో రాష్ట్రానికి ఏం వచ్చాయని, కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు పెద్ద ప్రాజెక్టులు వచ్చాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌కు మోడీ ఒక్క పెద్ద ఇన్వెస్ట్ మెంట్‌ను కూడా తీసుకురాలేకపోయారని ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో తాము ఓట్లకోసం రాజకీయం చేయబోమన్నారు. అంబానీ, అదానీలతో మోడీ దోస్తానా అందరికీ తెలుసన్నారు. వాళ్ల ఫ్లైట్‌లలో ఎవరెవరు తిరిగారో ప్రజలకు తెలుసన్నారు. పబ్లిక్ సెక్టార్‌లోని ఆస్తులను ఆదానీ, అంబానీలకు మోడీ కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. దేశంలోని సగం జనాభా ఆస్తులు వాళ్ల దగ్గరే ఉన్నాయని ఆయన తెలిపారు.
నల్లధనం ప్రయోజనాలు మోడీ మిత్రులకే…
ఎక్కువ విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరికీ ఉపయోగం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలని ఆయన సూచించారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని బిజెపి ఓట్లు అడగదని, కాంగ్రెస్‌పై నిందలు మోపడం ద్వారానే ఓట్లు అడుగుతారని ఆయన ధ్వజమెత్తారు. నల్లధనం వెలికి తీస్తామని ప్రధాని మోడీ ఎన్నో ప్రగల్భాలు పలికారని, నల్లధనం ప్రయోజనాలు వారి మిత్రులకే అందజేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించి మాట్లాడడం లేదన్నారు.
టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే ఐటీ, కేంద్ర సంస్థలు ఏ చేస్తున్నాయి?
టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే ఐటీ, కేంద్ర సంస్థలు ఏ చేస్తున్నాయి? ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో మీరు చూశారా? అదానీ, అంబానీ నుంచి డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో సోదాలు చేయండి. అదానీ, అంబానీ ఇళ్లలో ఈడీ, ఐటీ సిబ్బందితో తనిఖీలు చేయించండి. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం ప్రధాని స్థాయికి తగదని ఖర్గే సూచించారు. ధనవంతుల ఆస్తులు లాక్కుని పంచుతామనడం సిగ్గుచేటన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని గుర్తించాలని ఖర్గే సూచించారు.
30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
బిజెపి పార్టీ దేశ అభివృద్ధిని గాలికొదిలేసి విపక్షంపై ఆరోపణలే లక్ష్యంగా పెట్టుకుందని ఖర్గే ఫైర్ అయ్యారు. తెలంగాణకు పెద్ద ప్రాజెక్టులు ఏం తీసుకువచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాం నాటి ప్రాజెక్టులు ఏం ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. పేద మహిళలకు ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు.
మోడీకి ‘ఎం’ అనే అక్షరం అంటే భయం
కర్ణాటకలో, తెలంగాణలో తామిచ్చిన హామీలు నెరవేర్చామని ఖర్గే తెలిపారు. మోడీకి ‘ఎం’ అనే అక్షరం అంటే భయం అని అందువల్లే ‘ఎం’ అక్షరంతో మొదలయ్యే మటన్, మొగల్, మంగళ సూత్రంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖర్గే దుయ్యబట్టారు. ఈ దేశంలో మహిళల మంగళసూత్రాలు లాక్కునే ప్రధాని ఇంకా పుట్టలేదన్నారు. పదేళ్లకు ఓసారి లెక్కించాల్సిన దేశ జనాభాను మోడీ గణించలేదని, జనాభా లెక్కలు తీయడం ద్వారా ప్రభుత్వాలు పేద ప్రజలకు మెరుగైన కార్యక్రమాలు అమలు చేయవచ్చన్నారు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి ఎస్సీ,ఎస్టీ, బిసిల రిజర్వేషన్లు పెంచుతామన్నారు.