‘కుల గణన’గా పేర్కొంటున్న సాంఘిక, విద్యా విషయక సర్వే నివేదికపై రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో వ్యతిరేకత ఏమీ వ్యక్తం కాలేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం స్పష్టం చేశారు. నివేదికపై చర్చించేందుకు గురువారం సాయంత్రం మంత్రివర్గ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాలో ఒక వర్గం తెలియజేసినట్లుగా చర్చల సమయంలో మంత్రులు పరస్పరం గట్టి వాదనలకు దిగలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘గురువారం, మంత్రివర్గంలో దానిపై (కుల గణన నివేదికపై) చర్చించారు, అది అసంపూర్ణం, మరొక రోజుకు వాయిదా వేశారు. తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆ అంశంపై చర్చిస్తారు. ఎవ్వరూ దానిని వ్యతిరేకించలేదు’ అని సిద్ధరామయ్య చెప్పారు. సిద్ధరామయ్య బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, మంత్రులు కొందరు పరస్పరం గట్టిగా వాదించారన్న మీడియా వార్తలు అసత్యం’ అని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీవ్ర స్థాయిలో ఎటువంటి వాదనలూ జరగలేదని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా స్పష్టం చేశారు.
శివకుమార్ బెంగళూరులో విడిగా విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము మా అభిప్రాయాలు పంచుకున్నాం. అంతే. పెద్ద గొంతుతో మాట్లాడడం లేదా వాదనలు చేయడం వంటివి ఏమీ జరగలేదు. సూచనలు ఇవ్వడమైంది, అంతకు మించి ఏమీ నిర్ణయించలేదు’ అని వివరించారు. సర్వే కోసం ఉపయోగించిన కొలబద్దలను మంత్రివర్గం చర్చించిందని, సీనియర్ అధికారుల నుంచి మరింత సమాచారాన్ని, సాంకేతిక వివరాలను కోరిందని రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కె పాటిల్ గురువారం సమావేశం అనంతరం వెల్లడించారు. మంత్రివర్గం సర్వే నివేదికపై మే 2న మళ్లీ చర్చించి, నిర్ణయం తీసుకుంటుందని పాటిల్ తెలిపారు.