Sunday, December 22, 2024

నిధులు లేకుండా ఏ పార్టీ బతకలేదు: నితిన్ గడ్కరీ

- Advertisement -
- Advertisement -

నిధులు లేకుండా ఏ పార్టీ బతకలేదు
ఎన్నికల బాండ్లను మంచి ఉద్దేశంతో తెచ్చాము
లోపాలు ఉంటే సుప్రీం సూచనతో సరిదిద్దుకోవచ్చు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు

అహ్మదాబాద్: నిధులు లేకుండా రాజకీయ పార్టీని నడపడం సాధ్యం కాదని, మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017లో ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ తెలిపారు. సుప్రీంకోర్టు ఇటీవల ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొంటూ రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా..ఈ విషయమై సుప్రీంకోర్టు తదుపరి మార్గదర్శకాల గురించి చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమావేశం కావాలని గడ్కరీ సూచించారు.

గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపంలోని గిఫ్ట్ సిటీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో శనివారం పాల్గొన్న గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఎన్నికల బాండ్లపై జరిగిన చర్చలో తాను కూడా పాల్గొన్నానని ఆయన తెలిపారు. నిధులు లేకుండా ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదని ఆయన చెప్పారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలే రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తాయని, కాని భారత్‌లో అటువంటి విధానం లేదని ఆయన తెలిపారు.

అందుకే రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ఈ విధానాన్న్ని ఎంచుకున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రదాన ఉద్దేశం రాజకీయ పార్టీలకు నేరుగా నిధులు రావడంతోపాటు అధికారంలో ఉన్న పార్టీ మారినప్పడు సమస్యలు వస్తాయన్న కారణంగానే దాతల పేర్లు వెల్లడి కాకుండా నిబంధనలు విధించడం జరిగిందని ఆయన వివరించారు. ఒక కార్యక్రమాన్ని ఫైనాన్స్ చేసేందుకు మీడియా సంస్థకు స్పాన్సరర్ ఎంత అవసరమో ఒక రాజకీయ పార్టీ నడపడానికి నిధులు కూడా అంతే అవసరమని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఎలా పోటీ చేస్తాయని ఆయన ప్రశ్నించారు. పారదర్శకతను తీసుకురావడానికి ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. ఎన్నికల బాండ్లను తీసుకురావడంలో తమ ఉద్దేశం మంచిదేనని ఆయన చెప్పారు. అందులో లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దాలని సుప్రీంకోర్టు తమకు సూచించవచ్చని, పార్టీలన్నీ సమావేశమై ఏకగ్రీవంగా వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అన్నారు. మన దేశ ప్రయోజనాలు, విలువలతో కూడిన ప్రజాస్వామ్యం కోసం రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడానికి పారదర్శక మార్గాన్ని కనుగొనాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆయన చెప్పారు. నిధులు లేకుండా ఏ పార్టీ ఎటువంటి కార్యకలాపాలను చేపట్టలేదని గడ్కరీ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News