కేంద్రం సహకరించడం లేదని కమిటీ వెల్లడి
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ అంశంపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కమిటీ ఇచ్చిన రిపోర్టును అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది. 29 ఫోన్లను పరీక్షించగా, దాంటో అయిదు ఫోన్లలో మాల్‌వేర్ ఉన్నట్టు గమనించామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కానీ ఒక్క ఫోన్‌లో కూడా పెగాసస్ స్పైవేర్ ఉన్నట్టు గుర్తించలేదని కోర్టు తెలిపింది. అయితే పెగాసస్ అంశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కమిటీ చెప్పినట్టు చీఫ్ జస్టిస్ వెల్లడించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నే ఈ రిపోర్టును తయారు చేస్తోంది. మూడు భాగాలుగా రిపోర్టును ఇవ్వనున్నారు. దీంట్లో రెండు టెక్నికల్ కమిటీ రిపోర్టులుంటాయి. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ మరో నివేదికను సమర్పిస్తారు. రవీంద్రన్ సమర్పించే నివేదికను తమ వెబ్‌సైట్‌లో పబ్లిక్‌గా పెట్టనున్నట్టు సీజేఐ తెలిపారు. తొలి రెండు భాగాలకు చెందిన రిపోర్టు కావాలని కొందరు పిటిషనర్లు అడగ్గా దానిపై పరిశీలిస్తామని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసు విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు. కేసును విచారించిన ధర్మాసనంలో సీజేఐ రమణతోపాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.