గోధుమల దిగుమతి అవసరం లేదు
కేంద్రం తరఫున వివరణ
బ్లూమ్‌బెర్గ్‌కు జవాబు
న్యూఢిల్లీ : గోధుమల దిగుమతి ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. ప్రజలకు అవసరం అయిన గోధుమ నిల్వలు దండిగా ఉన్నాయని దిగుమతి అవసరం ఏదీ లేదని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ విభాగం తెలిపింది. ఉత్పత్తి తగ్గుదల, ధరల పెరుగుదల నేపథ్యంలో ఇండియా ఇతర దేశాల నుంచి గోధుమలను భారీ స్థాయిలో దిగుమతి చేసుకోనుందని బ్లూమ్‌బెర్గ్ వార్తను ప్రచురించింది. దీనికి సమాధానంగా ఈ కేంద్ర విభాగం తమ జవాబును ట్వీట్ ద్వారా తెలిపింది. దేశీయ అవసరాలు తీర్చేందుకు అవసరం అయిన నిల్వలు ఉన్నాయి. ప్రజా పంపిణీకి సరిపోనూ నిల్వలు ఎఫ్‌సిఐ గోదాంలలో ఉన్నాయని ఇక దిగుమతి అవసరం ఏముంటుందని వివరణ ఇచ్చారు. భారత్‌లో గోధుమ పంట ఎక్కువగా పండే పంజాబ్ హర్యానాలలో తీవ్ర వడగాడ్పులతో ఈసారి గోధుమ దిగుబడి తగ్గిందని ఇటీవల కేంద్రం ఓ సందర్భంలో తెలిపింది. గోధుమల దిగుమతికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తమకు సమాచారం అందిందని, దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ వివరణ కోరగా వారు స్పందించలేదని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.
భారత్‌లో గోధుమల ఉత్పత్తిపై పలు ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఈసారి ఇండియాలో గోధుమ దిగుబడి 99 మిలియన్ టన్నులు ఉంటుందని అమెరికా వ్యవసాయ విభాగం అంచనా వేసింది. అయితే ఇది తక్కువగానే ఉంటుందని దేశీయంగా మార్కెటీర్లు తెలిపారు. ప్రభుత్వం గోధుమకు తక్కువ సేకరణ ధర ఖరారు చేసినందున రైతులు ఈ పంట పట్ల ఆసక్తి చూపడం తగ్గించారని, దీనితో పాటు ప్రతికూల వాతావరణం వల్ల గోధుమల దిగుబడి తగ్గిందని, మార్కెట్‌లో ధరలు పెంచకతప్పదని ముంబైకి చెందిన ఓ డీలరు తెలిపారు. భారతదేశంలో వరి గోధుమలు జనాలకు ప్రధాన ఆహారంగా ఉంటున్నాయి. ప్రత్యేకించి ఉత్తరాదిలో ఎక్కువగా ప్రజలు గోధుమరొట్టెలు ఆహారంగా తీసుకుంటారు.