గడువు ప్రకారమే శాసనసభ ఎన్నికలు
15న జరిగే విజయగర్జనతో ప్రతిపక్షాల దిమ్మతిరిగాలి
మనపై మొరిగే కుక్కలు, నక్కల నోళ్లు మూయించాలి
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల వ్యవధి ఉంది
ఈలోగా అనేక పనులు పూర్తిచేయాలి
టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు : టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో సిఎం కెసిఆర్
కేంద్రంలోనూ క్రియాశీలత పాత్ర పోషిస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదని టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల వ్యవధి ఉందని, ఈ లోగా అనేక పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మనమే విజయం సాధించబోతున్నామని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 30వ తేదీన జరిగే హుజురాబాద్ ఉపఎన్నికలోనూ 13శాతం ఓట్ల ఆధిక్యంతో టిఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుభి మ్రోగించబోతున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే నవంబర్ 15న వరంగల్‌లో జరిగే విజయ గర్జన సభతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా…మనపై మొరిగే కుక్క లు, నక్కల నోర్లు మూయించాలన్నారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ పార్లమెంటరీ,అసెంబ్లీ పార్టీ సంయుక్త సమావేశం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలను ఉద్దేశించి ఆయన మాట్లడుతూ, గడువు ప్రకారంగానే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. మనం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీ పట్ల ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్నారన్నారు. దీనిని మనం కాపాడుకున్నంత కాలం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కలిసి, సమన్వయంతో ముందుకు సాగుదామన్నారు. ఇందు లో భాగంగా పార్టీని మరింత పటిష్టం చేసుకునేందుకుగానూ పార్టీ నిర్మాణంపై మరింత దృష్టి సారిస్తామన్నారు. త్వరలోనే పార్టీ పరంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసుకుందామన్నారు. అలాగే ఈ నెల 25వ తేదీన నగరంలోని హెచ్‌ఐసిసిలో జరిగే పార్టీ ప్లీనరి, అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా సిఎం కెసిఆర్ ప్రసంగించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర
రాబోయే రోజుల్లో కేంద్రంలోనూ టిఆర్‌ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించే అవకాశముందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే జోరు కొససాగే అవకాశాలు కనిపిస్తున్నాయని కెసిఆర్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. ఈ పరిస్థితి ఉత్పన్నం అయితే మాత్రం ఢిల్లీలో చక్రం తిప్పేది ముమ్మాటికి టిఆర్‌ఎస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు.