హైదరాబాద్: ప్రజల సహకారం లేకపోతే పల్స్ పోలియో విజయవంతం కాదని, ఈ రోజు పోలియో రహిత దేశంగా మారిందంటే నిరంతర ఈ కార్యక్రమం వల్లేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు.భారత దేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వం 27వ సారి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీ యుపిహెచ్ సిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి పిల్లలకి పోలియో చుక్కలను వేయడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రసంగించారు. దేశంలో 2011 నుంచి ఒక్క పోలియో కేసు కూడా లేదని, 2012లో భారత దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడిందని తెలిపారు.
హైదరాబాద్ లో 2007 తరువాత ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో 2800 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, బస్ స్టాప్ లలో, ఆస్పత్రులు , 85 ట్రాన్సిట్ పాయింట్స్, 123 మొబైల్ బృందాల ద్వారా ఈ కార్యక్రమం నడుస్తుందని వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. 4,5,6 తేదీల్లో 11 వేల మంది సిబ్బంది హైదరాబాద్ లో ఇంటింటికీ తిరుగుతున్నారని, సరోజినీ, నిలోఫర్, ఎంఎన్జీ హాస్పిటల్ లు అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారని, త్వరలోనే ఆ ఆస్పత్రులను సందర్శిస్తానని, సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యేలా చూస్తానని పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ఆరోగ్యంగా ఉంటే చాలు అని, అదే మహాభాగ్యం అని, అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పొన్నం పిలుపునిచ్చారు.