న్యూఢిల్లీ: హర్యానా, ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మధ్య పొత్తు ఉండే అవకాశం కనపడడం లేదని, అయితే మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మాత్రం ఇండియా కూటమి కలసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొంటుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం వెల్లడించారు. రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికలలో ఏక సూత్రాన్ని ఇండియా కూటమి పాటించబోదని పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు, ఇతర మిత్రపక్షాల నాయకుల మధ్య అంగీకారం కుదిరిన రాష్ట్రాలలో ఇండియా కూటమి సమైక్యంగా పోటీ చేస్తుందని ఆయన అన్నారు. ఇండియా కూటమి ఏ రాష్ట్రాలలో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటుందన్న ప్రశ్నకు జార్ఖండ్, మహారాష్ట్రలో పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్‌లో ఇండియా కూటమి మధ్య పొత్తు లేదని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో హర్యానాలో ఆప్‌కు ఒక సీటు కేటాయించామని, అయితే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి మధ్య పొత్తు ఉండదని ఆప్ స్వయంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఢిల్లీలో మాత్రం సీట్లు పొత్తు పెట్టుకున్నాయి. ఈ ఏడాది చివరిలో జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.