Friday, October 18, 2024

ఉచిత హామీలను నియంత్రించే అధికారం లేదు

- Advertisement -
- Advertisement -

Does not have power to regulate free guarantees

సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌లో ఇసి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. సుప్రీంకోర్టులో ఒక పిల్ విచారణ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఇసి ఈ అభిప్రాయాన్ని తెలియజేసింది. ఉచిత హామీలపై రాజకీయ పార్టీలను నియంత్రించేందుకు చేసే ప్రయత్నం తన అధికార పరిధిని దాటినట్లవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉచిత హామీలను ప్రకటించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూ బిజెపి నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇసి అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఉచిత హామీలను ప్రకటించడం లేదా పంపిణీ చేయడం అనేది సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయం. ఆ విధానాలు ఆర్థికంగా ఆచరణ సాధ్యమా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అది ప్రతికూల ప్రభావం చూపిస్తుందా లేదా అనేది ఆ రాష్ట్ర ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అంశం’ అని ఇసి తన అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర విధానాలను ఎన్నికల సంఘం నియంత్రించలేదని, గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేపట్టిన నిర్ణయాలను నియంత్రించలేమని ఇసి తెలిపింది.

చట్టంలో ఎటువంటి అధికారాలు లేకుండానే అలాంటి చర్యలను చేపట్టలేమని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించి చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి 2016 డిసెంబర్‌లో ఎన్నికల కమిషన్ కేంద్రానికి 47 ప్రతిపాదనలు పంపించిందని, అందులో ఒక చాప్టర్ రాజకీయ పార్టీల గుర్తింపు రద్దుకు సంబంధించినదని ఇసి తెలిపింది. ఒక రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం తనకు ఉండాలని ఎన్నికల కమిషన్ న్యాయ మంత్రిత్వ శాఖకకు సిఫార్సు చేసినట్లు కూడా ఇసి తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇక అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్‌కు సంబంధించి మూడు కారణాలపై తప్ప రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని 2002లో ఇచ్చినతీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కూడా తెలిపింది. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌పై ఈ ఏడాది జనవరి 25న సుప్రీంకోర్టు ఇసి, కేంద్రాన్ని కోరింది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పిల్‌ను దాఖలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News