న్యూస్‌డెస్క్: ముంబై ఎయిర్‌పోర్టులోని తమ వాటాను అదానీ గ్రూపునకు అమ్మడం వెనుక తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ జివికె గ్రూపు బుధవారం ఖండించింది. సిబిఐ, ఇడి వంటి సంస్థలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపయోగించడం ద్వారా జివికె గ్రూపుపై ఒత్తిడి తెచ్చి ఆ సంస్థ ముంబై ఎయిర్‌పోర్టులోని తన వాటాలను అదానీ గ్రూపునకు కట్టబెట్టిందని రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో చేసిన ఆరోపణలను జివికె గ్రూపు ప్రతినిధి ఖండించారు. ముంబై ఎయిర్‌పోర్టులోని తమ వాటాలను అదానీ గ్రూపునకు అమ్మాలన్న నిర్ణయం తమ యాజమాన్యం స్వచ్ఛందంగా తీసుకున్నదని ఇందులో ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు.
2021 జులైలో అదానీ గ్రూపు ముంబై ఎయిర్‌పోర్టు నిర్వహణను జివికె గ్రూపు నుంచి తీసుకుంది. ఎయిర్‌పోర్టు వ్యాపారానికి అవసరమైన నిధుల కోసం జివికె గ్రూపు అన్వేషిస్తున్న సమయంలో తమను అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ సంప్రదించారని జివికె గ్రూపు వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి ఒక టివి చానల్‌కు తెలిపారు. తనకు ఎయిర్‌పోర్టు వ్యాపారమంటే ఎఆసక్తి ఉందని, తనతో లావాదేవీలు జరపడానికి సిద్ధమేనా అంటూ అదానీ తమను సంప్రదించారని ఆయన చెప్పారు. ఒక నెలరోజుల్లో మొత్తం లావాదేవీలను పూర్తి చేస్తానని ఆయన చెప్పారని, తమకు కూడా నిధులు అవసరమైనందున ఇందుకు ఒప్పుకున్నామని సంజయ్ రెడ్డి వివరించారు. ఇందులో తాము ఒత్తిడిని ఎదుర్కొన్నామన్న ప్రశ్నే ఉదయించదని ఆయన చెప్పారు.