Wednesday, April 23, 2025

‘భూ భారతి’ని దుర్వినియోగం చేస్తే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

‘భూ భారతి’ చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా ఉపేక్షించేది లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మంగళవారం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ఎంఎల్‌ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…తమ ప్రభుత్వం రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని అన్నారు. రైతు లేనిదే.. రాజ్యం లేదని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచనతో ఈ చట్టం తీసుకువచ్చామని తెలిపారు. గ్రామ పరిధిలో ఉండే అధికారులతోనే ఈ చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వం చేసిన ధరణి వల్ల రైతులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, భూ వివాదాలు పెరిగాయే కానీ తగ్గలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రభుత్వం నడుస్తోందని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగలేదన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ అవగాహన సదస్సుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎంఎల్‌ఎ వేముల వీరేశం, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్‌డిఓ శేఖర్ రెడ్డి, డిఆర్‌డిఓ నాగిరెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిడిఓ జితేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News