న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందచేస్తున్న రూ. 6,000 ఆర్థిక సాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా వెల్లడించారు. ఈ పథకం కింద మహిళా రైతులకు సైతం ఆర్థిక సాయాన్ని పెంచే ఆలోచన ఏదీ లేదని మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి స్పష్టం చేశారు. పిఎం కిసాన్(కిసాన్ సమ్మాన్ నిది) పథకాన్ని రూ. 6,000 నుంచి రూ, 8,000-k రూ.12,000 పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందా అని సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రస్తుతం ఈ పథకం కింద రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలుగా రూ. 6,000 సహాయాన్ని ఏటా రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 15 వాయిదాలలో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.61 లక్షల కోట్లను ఈ పథకం కింద అందచేసినట్లు ఆయన తెలిపారు. సొంత భూమి ఉన్న రైతుల ఆర్థికావాలసరాలకు ఉపయోగపడడమే ఈ పథకం ఉద్దేశమని ఆయన చెప్పారు. దళారీలు లేకుండా దేశవ్యాప్తంగా రైతులకు ఈ పథకం ప్రయోజనాలను నేరుగా డిజిటల్ మాధ్యమం ద్వారా అందచేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 2,62,45,829 మంది రైతులు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందారని మరో ప్రశ్నకు జవాబిస్తూ ఆయన తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన నిర్వహణా మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించి, ధ్రువీకరించే బాధ్యత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదేనని మంత్రి చెప్పారు.