లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి
న్యూఢిల్లీ: దేశ ద్రోహం ఆరోపణలకు సంబంధించి నమోదు చేసే ఐపిసిలోని 124ఎ సెక్షన్‌ను రద్దు చేసే ప్రతిపాదన ఏదీ కేంద్ర హోం మంత్రిత్వశాఖ వద్ద లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. ఈ చట్టానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టు వద్ద న్యాయ పరిశీలనలో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఐపిసి, 1860కి చెందిన 124 సెక్షన్‌ను రద్దు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆయన లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో లిఖితపూర్వకంగా బదులిచ్చారు. 124ఎ సెక్షన్‌ను వలసవాద చట్టంగా సుప్రీంకోర్టు ఇటీవల అభివర్ణిస్తూ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించిందా అని అస్సాం ఎంపి బద్రుద్దీన్ అజ్మల్ ప్రశ్నించారు. అంతేగాక ఈ చట్టం ఆవశ్యకత, చట్టబద్ధతపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందా అని ఆయన ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ అటువంటి వ్యాఖ్యలేవీ సుప్రీంకోర్టు ఏ తీర్పులోనూ చేయలేదని స్పష్టం చేశారు.