Wednesday, December 25, 2024

న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేవు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు కల్పించడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ జడ్జీలుగా నియమించే సమయంలో ప్రాతినిధ్యం లేని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సిఫార్సు చేయాలని జడ్జీలు, కొలీజియంకు సూచించినట్టు తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్‌లో వెల్లడించారు.

న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా ? అని డిఎంకె నేత తిరుచ్చి శివ రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. దీనికి బదులిచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి “ ప్రస్తుతం అనుసరిస్తోన్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేవు. అయినప్పటికీ , న్యాయమూర్తులుగా పేర్లను సిఫార్సు చేసేటప్పుడు వెనుకబడిన తరగతులు, మహిళలతోపాటు న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం లేని వర్గాల వారి పేర్లను పొందుపర్చాలని జడ్జీలకు, ముఖ్యంగా కొలీజియం సభ్యులకు గుర్తు చేశాను ” అని వెల్లడించారు.

ఇక గుజరాత్‌లో పెండింగ్ కేసులకు సంబంధించి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14.47 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. న్యాయ సహాయం అభ్యర్థించే వారి కోసం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నియమించే లాయర్ల సంఖ్యను పెంచాలని, సభ్యులు అడిగిన ప్రశ్నకూ కేంద్ర మంత్రి స్పందించారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్‌ఎల్‌ఎస్‌ఏ తోపాటు రాష్ట్రస్థాయిలో ఎస్‌ఎల్‌ఎస్‌ఏ , జిల్లా స్థాయిలో డీఎల్‌ఎస్‌ఏ , తాలూకా స్థాయిలోనూ ఉచితంగా న్యాయ సేవలు అందుతున్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News