బీహార్ ముఖ్యమంత్రి, జెడి (యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌తో తిరిగి పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించినప్పుడు ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ నిరుడు ఆర్‌జెడితో పొత్తు తెంచుకుని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు తిరిగి వచ్చిన విషయం విదితమే. ‘ఎన్‌డిఎ రిజర్వేషన్లను హరిస్తోంది’ అనే ఆరోపణపై ఆర్‌జెడి పాట్నాలో నిర్వహించిన ధర్నా అనంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మీడియా గోష్ఠిలో మాట్లాడారు. తన మాజీ బాస్, జెడి (యు) అధిపతితో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేతులు కలిపే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించినప్పుడు తేజస్వి సమాధానంగా ‘మేము ఎందుకు చేతులు కలుపుతాం?
ఇప్పుడు ఉన్న సమస్య నుంచి దృష్టి మళ్లించే యత్నం ఎందుకు చేస్తున్నారు’ అని ఎదురు ప్రశ్నించారు. ఇటీవలే 74వ ఏట ప్రవేశించిన నితీశ్ ఎన్నికల తరువాత బిజెపి నాయకత్వం మార్పునకు ఒత్తిడి తీసుకురావచ్చునని భయపడుతున్నారని, తిరిగి పొత్తు ‘ఆఫర్’తో ఆర్‌జెడి ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకోగలదని ఒక వర్గం మీడియాలో ఊహాగానాలు సాగుతున్నట్లు తేజస్వి దృష్టికి తీసుకువచ్చారు. అయితే, మామూలుగా మృదువుగా మాట్లాడుతుండే తేజస్వి యాదవ్ ‘ఎవరి నుంచీ ఎటువంటి ఆఫరూ లేదు. నా పార్టీలో ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూజీకి, నాకు మాత్రమే పొత్తులపై ఏ నిర్ణ యమైనా తీసుకునే అధికారం ఉంది. దయచేసి వ్యర్థపు మాటలు మాట్లాడకండి’ అని కటువుగా అన్నారు.