Monday, December 23, 2024

విశ్రాంత ప్రొపెసర్ అన్సారీ ఆరోపణల్లో నిజం లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదవీవిరమణ తరువాత తనకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించటం లేదంటూ విశ్రాంత ప్రొఫెసర్ అన్సారీ చేస్తున్న ఆరోపణలను ఉస్మానియా విశ్వవిద్యాలయం తోసిపుచ్చింది. ఓయూ లో ఇటీవల ఎంతో మంది అధ్యాపకులు పదవీ విరమణ పొందారని ఎవరికి రాని సమస్య కేవలం ప్రొఫెసర్ అన్సారీకి మాత్రమే ఎందుకు వస్తుందని ప్రశ్నించింది. పాలకమండలి, ఓయూ అధికారులపై ప్రొఫెసర్ అన్సారీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అన్సారీకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిబంధనల ప్రకారం ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని అందుకు సంబంధించిన ప్రొసీజర్స్ పాటించాలని సూచించింది.

ప్రచార, సామాజిక మాధ్యమాల్లో ఓయూ అధికారులపై ప్రొఫెసర్ అన్సారీ తప్పుడు ప్రచారం చేయటం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొంది. అన్సారీ విషయంలో పలు అంశాలపై రెండు కమిటీలు తమ నివేదికలు ఇచ్చాయి. 1997లో లింగ్విస్టిక్స్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన వెలువడింది. అందులో బీసీ – డి విభాగంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీకి అవకాశం ఉన్నప్పటికీ వర్క్ లోడ్ లేని కారణంగా కొంత కాలం పోస్టును భర్తీ చేయలేదు. మైనారిటీ కమిషన్, హైకోర్టు సూచనలతో భర్తీ చేసేందుకు యూనివర్శిటీ మొగ్గుచూపింది. అయితే బీసీ డీ లో ఉన్న పోస్టును బీసీ – బి కేటగిరికి మార్చి ప్రొఫెసర్ అన్సారీకి ఉద్యోగం ఇచ్చారు.

1997లో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ 2003లో జరిగిన నియమాకంలో అన్సారీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు చేపట్టారు. అయితే తనకు 1997 నుంచే సర్వీస్ ను పరిగణించాలని మైనారిటీ కమిషన్, ప్రభుత్వానికి అన్సారీ విజ్ఞప్తులు చేశారు. ఆయన అభ్యర్థనను ఉస్మానియా పాలక మండలి పలు మార్లు తోసి పుచ్చింది. 2003లో నియామకమైన వ్యక్తికి 1997 నుంచి సర్వీస్ ఎలా పరగణిస్తారని పాలక మండలి 12 సార్లు అన్సారీ అభ్యర్థనను పక్కన బెట్టింది. కేవలం 2011 లో ఇంఛార్జి వీసీగా ఉన్న ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండలి అన్సారీ సర్వీస్ ను పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై ఆ తర్వాత జరిగిన పాలక మండళ్లు కూడా తీవ్ర అభ్యంతరం తెలిపి ఉద్యోగంలో చేరేనాటికి ముందు కాలాన్ని సర్వీస్ కింద పరిగణించలేమని తెల్చి చెప్పాయి. వివరణ కోసం ప్రభుత్వానికి లేఖ రాసినా ప్రభుత్వం నుంచి కూడా తిరస్కరణ ఎదురైంది.
13- సెప్టెంబర్ -2021 తేదిన జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ పాలక మండలి సమావేశంలో ప్రొఫెసర్ అన్సారీ సర్వీస్ సహా ఆయనపై ఉన్న అభియోగాలు, ఆరోపణలపై చర్చ జరిగింది.

అన్సారీ కేసులో సర్వీస్ నిబంధనలు, అపాయింట్ మెంట్ విషయంలో ఉన్న ఆరోపణలపై ప్రొఫెసర్ అప్పారావు చైర్మన్‌గా ఈసీ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అదే విధంగా ప్రొఫెసర్ అన్సారీ పై వచ్చిన ఫిర్యాదులు, లింగ్విస్టిక్ విభాగంలో జరిగిన అవకతవకలపై ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఛైర్మన్‌గా, యూజీసీ డీన్, లా కళాశాల ప్రిన్సిపల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లతో మరో కమిటీ వేశారు. గతంలో జరిగిన దైరతుల్ మారిఫ్ సంబంధించిన అవకతవకలపై ఇప్పటికే ఓయూ రిజిస్ట్రార్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. నాన్ యూనివర్శిటీ ఫండ్ నుంచే హాస్టళ్ల నిర్వహణకు నిధులు వినియోగిస్తామని సంబంధిత ప్రిన్సిపల్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. నాన్ యూనివర్శిటీ ఫండ్ కు పక్కా ఆడిట్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ లోకల్ ఆడిట్ విభాగం సైతం ధృవపరిచిన విషయాన్ని ఆర్ట్ అండ్ సోషల్ సైన్సెస్ ప్రిన్సిపల్ గుర్తు చేశారు. ప్రొఫెసర్ అన్సారీ పై కమిటీలు ఇచ్చిన నివేదికలను రానున్న పాలక మండలి సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. యూనివర్శిటీ నియమ నిబంధనలను అనుసరించి తనకు రావాల్సిన బెనిఫిట్స్ పొందాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News